Aasara Pensions | తెలంగాణలో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత
Aasara Pensions | ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నారని వెల్లడించింది.
నివేదికల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వారి నెలవారీ పెన్షన్‌లతో పాటు ఆసరా పెన్షన్లు (Aasara Pensions) కూడా పొందుతున్నారు. వీరిలో 3,824 మంది మరణించగా, మిగిలిన 1,826 మంది రెండు రకాల పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ నుంచి వీరికి ఆసరా పింఛన్లను నిలిపివేసింది.
ఒక్క ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే 427 మంది అక్రమంగా డబుల్ పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ చెల్లింపుల ద్వారా ఖమ్మం జిల్లాలో సుమారు రూ.2.50 కోట్లు దుర్వినియోగమైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు.
ఆసరా పథకం నిబంధనల ప్రకారం నిరుపేద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ లేదా ఫైలేరియా లేదా ఎయిడ్స్‌తో బాధపడుతున్న రోగులు ఈ ఆసరా పింఛన్లకు అర్హులు. దారిద్య్రరేఖకు దిగువన ఉండటం, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికే ఈ ఆసరా పింఛన్లను అందించాల్సి ఉంటుంది.
అయితే అనర్హుల తొలగింపు పేరుతో కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి రికవరీ నోటీసు ఇవ్వడం అమానుషమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. మల్లమ్మకు పెన్షన్ అందని అధికారులు స్పష్టం చేశారు. ఆమె కుమార్తె దాసరి రాజేశ్వరి ఏఎన్ ఎం ఉద్యోగి. 2010లో ఆమె మరణించింది. ఆమె కుటుంబ పింఛను నెలకు రూ.24,073 మల్లమ్మకు మళ్లించారు. అయితే ఇటీవల నిర్వహించిన సర్వేలో మల్లమ్మకు కూడా ఆసరా పింఛన్ వస్తోందని గుర్తించారు. దీంతో జిల్లా అధికారులు జూన్ నుంచి ఆమెకు ఆసరా పింఛన్‌ను నిలిపివేశారు.
ఇదిలా ఉండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లు వంటి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సహా ఇతర అనర్హులకు రైతు బంధు (Rythu Bandhu ) చెల్లించడం ద్వారా సుమారు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..