Rahul Gandhi | వీసీల నియామకాలపై రాహుల్ గాంధీ ‘తప్పుడు ప్రచారం’.. చర్యలు తీసుకోవాలని 181 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ
Rahul Gandhi | న్యూఢిల్లీ: యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అసత్య ప్రచారం చేశారని, వైస్ ఛాన్సలర్ల పరువు తీశారని ఆరోపిస్తూ మాజీ, ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌లతో సహా కనీసం 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖపై సంతకం చేశారు. రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.
యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి వైస్ ఛాన్సలర్‌లను కేవలం మెరిట్‌తో కాకుండా ఏదో ఒక సంస్థతో అనుబంధం ఆధారంగా నియమించారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపించారని వీసీలు, విద్యావేత్తలు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
విద్యావేత్తలు చెబుతున్నదాని ప్రకారం, వైస్-ఛాన్సలర్‌లను విద్యార్హతల కంటే కనెక్షన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ వాదనలను సంతకం చేసినవారు తీవ్రంగా ఖండించారు, VCలను ఎంపిక చేసే ప్రక్రియ కఠినంగా, పారదర్శకంగా, మెరిటోక్రసీ, సమగ్రత సూత్రాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
యూనివర్శిటీ హెడ్‌లను ఎన్నుకోవడం అనేది మంచి విద్యా, పరిపాలనా నైపుణ్యాలు కలిగిన సరైన వ్యక్తులను ఎంపిక చేయడమేనని విద్యావేత్తలు పేర్కొన్నారు, వారు విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో కాన్పూర్‌లోని CSJM యూనివర్సిటీ VC వినయ్ పాఠక్, ఉదయపూర్‌లోని పసిఫిక్ యూనివర్సిటీ ఛాన్సలర్ భగవతి ప్రకాష్ శర్మ, చిత్రకూట్‌లోని మహాత్మా గాంధీ గ్రామోదయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఎన్‌సీ గౌతమ్, బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అలోక్ చక్కర్వాల్, సోనిపట్‌లోని బీఆర్ అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీ మాజీ వీసీ వినయ్ కపూర్ తదితరులు ఉన్నారు.
గ్లోబల్ ర్యాంకింగ్స్, చెప్పుకోదగ్గ అక్రిడిటేషన్‌లు, కొత్త పరిశోధన పురోగతులు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించే పాఠ్యాంశాల అప్ డేట్స్, మెరుగైన ఉద్యోగ నియామక అవకాశాలు వంటి వాటి వల్ల భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు భారీ పురోగతిని సాధించాయని వైస్ చాన్స్‌లర్లు తెలిపారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో తమ నిబద్ధత ప్రతిబింబిస్తుందని చెప్పారు.
“రాహుల్ గాంధీ అసత్య వాఖ్యలు చేశారు. రాజకీయ మైలేజీని పొందాలనే ఉద్దేశ్యంతో వైస్ ఛాన్సలర్ల పరువు తీశారు. అందువల్ల తక్షణమే అతనిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు. నిరాధారమైన వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఏది నిజమో, ఏది అసత్యమో జాగ్రత్తగా గుర్తించాలని వారు ప్రతి ఒక్కరినీ కోరారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..