Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..
యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం
భువనగిరి : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతిచ్చారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి బాధ్యతలను అప్పగించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే అంటే వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని చెప్పారు.
ప్రత్యేక కమిటీ
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఛైర్‌పర్సన్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో దేవాదాయ శాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టస్ సలహాదారు, వైటీడీఏ ఉపాధ్యక్షుడు జి.కిషన్‌రావు,యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణాధికారి, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ బంగారు తాపడం పనులను పర్యవేక్షించంతోపాటు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు బంగారు తాపడం పనులు, ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రసిద్ధ సీతారామ చంద్రస్వామి దేవాలయ అభివృద్ధి, విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులను మంజూరు చేస్తూ మరో జీవోను కూడా ప్రభుత్వం జారీ చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..