Weather Report Updates | తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లని వార్త చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇక సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని తెలిపింది. ఈమేరకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం వానలు కురిసే చాన్స్ లేదని స్పష్టం చేసింది. 7, 8వ తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు వడ గాల్పులు వీచే చాన్స్ ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు కూడా రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా రికార్డు కావొచ్చని పేర్కొన్నది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిది. ఈనెల 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
వేసవిలో జాగ్రత్తలు అవసరం..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వేడి తీవ్రతకు ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో వడగాడ్పులు కారణంగా పిల్లలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, కళ్లు తిరగడం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు వస్తే.. పిల్లలను చల్లని ప్రదేశాల్లో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కొబ్బరి నీరు లేదా ఓఆర్‌ఎస్ తాగించాలని తెలిపారు. వేసవిలో ఎక్కువగా నీరు తాగుతూ చల్లని నీడ పట్టున ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..