వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్
వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరాలు (cyber crime) కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధంచిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వరంగల్ సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరమైన ప్రదేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ భవన ప్రాంగణంలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అవసమైన మౌలిక సదుపాయల ఏర్పాటు పాటు, అధికారులు, సిబ్బంది కేబిన్లు, సైబర్ ల్యాబ్ ఏర్పాట్లపై సీపీ రంగనాథ్ సంబంధిత అధికారులతో చర్చించారు.
బాధితులకు అండగా కొత్త పీఎస్
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్ (warangal cp ranganath) మాట్లాడుతూ.. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ద్వారా బాధితులకు వేగంగా సహకారన్ని అందజేయడంతో పాటు, సైబర్ కేసులు నమోదు చేయడం, దర్యాప్తు, నేరస్తుల అరెస్టు చేపడతారు. ఇందులో కోసం ఒక ఏసీపీ, ఒక ఇన్ స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లు ఈ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం అవసరమైన వనరులపై రాష్ట్ర పోలీస్ డీజీపీ అంజనీకుమార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇకపై సైబర్ బాధితులు సామాజిక మధ్యమాలైన twitter/TSCyberBureau, facebook/TSCyberBureau/, instagram/tscyberbureau/ ద్వారా గాని https://wa.me/918712672222 లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ లు సంజీవ్, సురేష్ కుమార్, ఏసీపీలు విజయ్ కుమార్, జనార్దన్ రెడ్డి, నాగయ్య, అనంతయ్య, ఇన్ స్పెక్టర్లు లక్ష్మీ నారాయణ, సంతోష్, ఆర్ఐ శ్రీధర్ పాల్గొన్నారు.