Warangal Ring Road | దశాబ్డాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ రింగ్‌రోడ్ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు (Warangal Ring Road) కోసం భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డును ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు అనుసంధానంగా రోడ్డును అభివృద్ధి చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. తాగునీటి పైపులైన్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అందుబాటులోకి మహిళా శక్తి క్యాంటీన్లు
స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్కూల్ విద్యార్థుల యూనిఫాంలకు సంబంధించి పెండింగ్ బిల్స్ ఉంటే వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్‌లు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. ఈ విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈమేరకు ఇందిరా మహాశక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈమేరకు హన్మకొండ కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. త్వరలో వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..