Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే అన్ని విధాలుగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల ను నడిపిస్తోంది. రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడంతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లను కూడా అన్ని మార్గాల్లో ప్రవేశపెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను తక్కువ దూరం గల మార్గాల్లో నడిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వచ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో కూడా నడిపించాలని భావిస్తున్నారు.
అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌లో కాకుండా చైర్ కార్‌లో ఉన్నప్పటికీ, దీపావళి, ఛత్‌ల పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ – పాట్నాల మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును నడిపించాలని నిర్ణయించారు. పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ మార్గంలో వందేభారత్‌ను నడపాలని నిర్ణయించారు. వందే భారత్ రైలు న్యూఢిల్లీ, వారణాసి మధ్య నడుస్తుంది. అయితే దిల్లీ నుంచి పాట్నా వరకు ప్రత్యేక రైలుగా నడిచే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత పొడవైన మార్గంలో నడుస్తుంది. ఈ రైలు 994 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
ఢిల్లీ- పాట్నా మధ్య నడిచే వందే భారత్ ప్రత్యేక రైలు దాదాపు 11.5 గంటల్లో 994 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రైలు ఢిల్లీ – పాట్నా మధ్య 8 రౌండ్లు నడవనుంది. టైమ్ టేబుల్ విషయానికొస్తే.. ఈ రైలు 30 అక్టోబర్, 1 నవంబర్, 3 నవంబర్, 6 నవంబర్‌లలో న్యూఢిల్లీ నుండి పాట్నా మధ్య నడుస్తుంది. ఈ రైలు పాట్నా నుంచి అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 4, నవంబర్ 7వ తేదీలలో సేవలందించనుంది.
ఈ ప్రత్యేక రైలు (02252) న్యూదిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 8:25 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు పాట్నా చేరుకుంటుంది. రైలు కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్, పండిట్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఈ రైలు పాట్నా జంక్షన్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.
ఈ రైలు ఛార్జీల విషయానికొస్తే.. ఢిల్లీ నుంచి పాట్నా వందే భారత్ రైలులో చైర్ కార్ ధర రూ..2,575, ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.4655.