
Hyderabad : సంక్రాంతి వేడుకలు (Sankranti Festival) సమీపిస్తుండడంతో పండుగల వేడుకలు ఉత్సాహంగా జరుపునేందుకు హైదరాబాద్ జనమంతా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో తరలివస్తున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ప్లాట్‌ఫారమ్‌లపై బస్సులు, రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. కాగా జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వారి లగేజీతో పాటు సికింద్రాబాద్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. వారాంతంలో చాలా మంది తమ ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకున్నందున రాబోయే కొద్ది రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎంజిబిఎస్, జెబిఎస్ లో కోలాహలం
ఇదిలా ఉండగా జంటనగరాల్లోని బస్ స్టేషన్లు కూడా తమ గమ్యస్థానాలకు బస్సులు ఎక్కేందుకు ప్రయాణికుల రద్దీ కనిపించింది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (Mahatma Gandhi Bus Station) (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (Jubilee Bus Station) రెండూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు కనెక్ట్ చేసే నగరంలోని ముఖ్యమైన జంక్షన్‌లు, రహదారులపై భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
ఇక హైదరాబాద్-విజయవాడ హైవేపై గురువారం నుంచి భారీగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి.
ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ
సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ఆర్టీసీ ధరలకు అనుగుణంగా చార్జీలను కట్టడి చేయాల్సిన ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన రూట్లలో సాధారణ ధరల కంటే మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు, ఇతర రవాణా మార్గాల ద్వారా సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ప్రజలు అధిక ఛార్జీలు చెల్లించవలసి వస్తోంది. చాలా మంది ప్రైవేట్ ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి వైపు తమ బస్సు ఛార్జీలను పెంచారు.
ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు.. భారీగా కాష్ చేసుకుంటున్నారు. ఇది సాధారణంగా జనవరి 10 మరియు 15 మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, ఈ సమయంలో టిక్కెట్ ధరలను గణనీయంగా పెంచేస్తున్నారు.
సాధారణంగా ఏసీ బస్సు సర్వీసుల్లో విజయవాడకు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు సాధారణ టిక్కెట్ చార్జీలు ఉండగా, ప్రస్తుత పండుగ వారం రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వంటి రూట్లలో కూడా ఈ ధరలు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి.
ఈ సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం TGSRTC తోపాటు APSRTC 6,000 చొప్పున ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి . ఆర్టీసీ సర్వీసుల్లో సాధారణ ధరలకే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, అధికారులు కోరుతున్నారు. మరోవైపు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ప్రైవేట్ బస్సులపై ఆర్‌టీఏ అధికారులు నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గురువారం ఒక్కరోజే దాదాపు 15 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..