Fine Rice to Ration Card Holders | పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం .. గోధుమలు కూడా
Ration Card Holders | హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం సన్నబియ్యం మాత్రమే కాదు.. ఇకపై సబ్సిడీ ధరలకు గోధుమలను కూడా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
సన్నబియ్యం పంపిణీపై మంత్రి సమీక్ష
ఈమేరకు హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై అధికారులతో మంత్రి చర్చించారు. పేద ప్రజలకు ఉద్దేశించిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేషన్ డీలర్లను మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ప్రోత్సాహకాలు అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులైన వారి డీలర్‌షిప్‌ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని మంత్రి హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించిందని తెలిపారు. సరిపడా బియ్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సమస్యలను పరిష్కరించి పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత మెరుగుపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అంత్యోదయ కార్డుల (Anthydaya Ration Card Holders) సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని కోరారు. మహాలక్ష్మీ పథకానికి సంబంధించి రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పౌర సరఫరాల శాఖ ప్రచారం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
లబ్దిదారులందరికీ మెసేజ్‌లు పంపి ప్రచారం కల్పించాలని సూచించారు. చౌక ధరల దుకాణాల్లో 1,629 ఖాళీలు ఉన్నాయని తెలుసుకున్న మంత్రి ఈ అంశంపై చర్చించారు. వెంటనే ఆ ఖళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంత్రికి హామీ ఇచ్చారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..