తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు నవంబరు 15 చివరి తేదీ. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణప్రాంతాల్లో ఉండగా, 20,892 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. సగటున ప్రతీ పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 27,798 కేంద్రాల్లో (78శాతం) వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక 597 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే 644 మోడల్ కేంద్రాలు, మరో 120పోలింగ్ కేంద్రాలను దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తెలంగాన రాష్ట్రంలో మొత్తం 3.17కోట్ల మందికి ఓటు హక్కు ఉందని సీఈసీ తెలిపారు. వారిలో 1.58కోట్ల మంది పురుషులు ఉండగా, 1.58 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలపారు. ఇదిలా ఉండగా 8.11 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని రాజీవ్ కుమార్ తెలిపారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే
మధ్యప్రదేశ్ – నవంబర్ 17
రాజస్థాన్ – నవంబర్ 23
ఛత్తీస్‌గఢ్ – నవంబర్ 7, నవంబర్ 17 (దశ రెండు)
తెలంగాణ – నవంబర్ 30, డిసెంబర్ 3 కౌంటింగ్.
మిజోరం – 7 నవంబర్
కాగా ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఐదు రాష్ట్రాల్లో మొత్తం 16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.01 లక్షల బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.