అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..
పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తాయి. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలలతో సందడి నెలకొంటుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుందనేది వేద పండితుల మాట. ఎంతో గొప్పదైన పవిత్రమాసం ఈ రోజు (ఆగస్టు 17)న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు వస్తున్నాయి.
సనాతన ధర్మంలో (హిందూ) చంద్ర మానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఎంతో పవిత్రత కలిగింది ఈ శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది.. త్రిమూర్తుల్లో స్థితికారుడు.. దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడైన మహా విష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహా లక్ష్మికి ఈ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు పేర్కొంటారు. విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం.. అదే పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైంది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు సైతం చెబుతున్నాయి.
శివారాధనకు విశిష్టమైనది..
శివుడి ఆరాధనకు విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం కూడా ఒకటి. ఈ మాసం శివ పూజకు ఎంతో ఉత్తమమైనదని, ముఖ్యంగా భగవదారాధన లో శివ, కేశవ భేదం లేకుండా పూజించేందుకు విశేషంగా చెబుతారు. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని వేదపండితులు చెబుతుంటారు. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు
పూర్తిగా, అలా సాధ్యం కానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనేక శుభ ఫలితాలు
కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కో రోజు ఒక్కో భగవంతుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఈమాసంలో భక్తితో ఆచరించే ప్రతీపూజకు తగిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు పేర్కొంటారు..
మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మాసంలో అన్ని మంగళ వారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం.. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం, మంగళ గౌరీ నోము అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్రతం గురించి నారధుడు సావిత్రికి, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలో ఉంది. ఈ వ్రతాన్ని కొత్తగా వివాహమైన వారు ఆచరించాలి. పెళ్లయిన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం
క్రమంతప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే
కాకుండా వారి కుటుంబంలో సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
వరలక్ష్మీ వ్రతం
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేయాలి. ఒక వేళ అప్పుడు వీలు కాకపోతే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజించాలి. తర్వాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన తర్వాత ఈ శ్లోకాన్ని పఠించాలి.
శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే
అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తయిదువుల కు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం
స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్యబలాన్ని వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణ మాసంలోని విశిష్టతలు..
ఈ మాసంలో శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అనే రెండు శుభ దినాలు ఉన్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంచి మహావిష్ణునువును
పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.
శుక్ల పక్ష పౌర్ణమి: శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదరసోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాము. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్ర ధారణ, వేద అభ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణ పాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణ పక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోనే.. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోమాతలను పూజించడం వంటివి సైతం ఈనెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ మాసంలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలుతూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.