Telangana

Medaram Jatara 2026 : దక్షిణ కుంభమేళాకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఇవే!

Spread the love
  • 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక జాతర ఆరంభం
  • 29న‌ చిలకలగుట్ట నుంచి సమ్మక్క కుంకుమ గద్దెపైకి.. ఇదే ప్రధాన ఘట్టం
  • 30న‌ భక్తుల దర్శనం
  • 31న‌ అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం మ‌హాజాతర పరిసమాప్తం

వరంగల్/ములుగు: తెలంగాణ కుంభమేళా, కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతర (Medaram Jatara 2026)కు ములుగు జిల్లా మేడారం ముస్తాబైంది. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేసింది.

నేడే తొలి ఘట్టం: పగిడిద్దరాజు, జంపన్నల ఆగమనం

జాతరలో మొదటి రోజైన బుధవారం అత్యంత కీలకమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి:

  • పగిడిద్దరాజు రాక: మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి, కాలినడకన మేడారానికి తీసుకువస్తారు. గద్దెలపై పగిడిద్దరాజును ప్రతిష్ఠించడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.
  • జంపన్న గద్దెకు: కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశీయులు జంపన్నను రాత్రి 7 గంటలకు జంపన్నవాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి తీసుకువస్తారు.

ఈసారి జాతరలో నూతన ఆకర్షణలు & ఆధునిక సౌకర్యాలు

గతంలో లాగా కాకుండా, ఈసారి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం వినూత్న సాంకేతికతను జోడించింది:

  1. రాతి కట్టడాలు & శిల్పకళ: రూ. 251 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని మరో రెండు శతాబ్దాల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా రాతి కట్టడాలతో నిర్మించారు. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పాలు భక్తులను కట్టుకుంటున్నాయి.
  2. ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్స్: జాతరలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈసారి కొత్తగా ‘ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్స్’ ప్రవేశపెట్టారు. వీటి ద్వారా తప్పిపోయిన పిల్లలను సులభంగా గుర్తించవచ్చు.
  3. హెలికాప్టర్ సేవలు: ప్రయాణ ప్రయాస తగ్గించేందుకు ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తుల కోసం హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది.
  4. క్యూ లైన్ల విస్తరణ: ఒకేసారి 9 నుండి 10 వేల మంది దర్శించుకునేలా ప్రాకారాన్ని విస్తరించారు. గద్దెలన్నీ ఒకే వరుసలో ఉండేలా మార్పులు చేశారు.

రవాణా మరియు ట్రాఫిక్ నియంత్రణ

  • ఆర్టీసీ బస్సులు: 4,000 బస్సులతో 20 లక్షల మందిని చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం (మహాలక్ష్మి) వర్తిస్తుంది. 1500 ఎకరాల్లో 33 చోట్ల 3 లక్షల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. ట్రాఫిక్ చిక్కులను పర్యవేక్షించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ప్రత్యేక యాప్‌ను వినియోగిస్తున్నారు.

భక్తులకు సూచనలు:

  • స్నానఘాట్లు: జంపన్నవాగు వద్ద నీటి ఎద్దడి లేకుండా మోటార్ల ద్వారా నీటిని నింపుతున్నారు. 350 మంది ఈతగాళ్లు పహారా కాస్తున్నారు. అటవీ ప్రాంతం కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు కోరుతున్నారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *