Ugadi Utsavam | మన దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే..
RSS Warangal Ugadi Utsavam : నేటి తరం మన మూలాలను, చరిత్రను అధ్యయనం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వరంగల్ విభాగ్ కార్యవాహ్ గద్దె రమేష్ (Gadde Ramesh) సూచించారు. 1947 కన్నా ముందు మనం పుట్టి ఉంటే స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసేవాళ్ళమని, ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యతను దేశం మనకు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాభిమానాన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి స్వయంసేవకుడు కట్టుబడి ఉండాలని, సంఘమే జీవనంగా సాగాలని రమేష్ పిలుపునిచ్చారు.
ఉగాది పర్వదినం సందర్భంగా వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది ఉత్సవం (RSS Warangal Ugadi Utsavam ) లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మం, భారత చరిత్ర, యుగాల తత్వం, దేశభక్తి, సంఘ సేవ, సమాజ నిర్మాణం, ప్రస్తుత సాంకేతిక ప్రభావాలు వంటి అనేక అంశాలను సమగ్రంగా వివరించారు.
కలియుగంలో ధర్మ రక్షణకు ప్రతి స్వయంసేవకుడు నడుం బిగించాలి.
భారతదేశం సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకున్న నాగరికతగా వేల ఏళ్ల చరిత్రను కలిగి ఉందని, కాలగణనలో సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. ప్రస్తుతం గ్లోబలైజేషన్ కారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నప్పటికీ, మన యుగాల ఆధారిత గణన ప్రకారం కలియుగంలో ఐదువేల సంవత్సరాలకు పైగా గడిచిందని తెలిపారు.
Sadanandan Master | దుండగుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..
సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నిలిచి, సమాజం నైతిక విలువలతో, కుటుంబ వ్యవస్థతో, మహిళలకు గౌరవంతో ముందుకు సాగిందని చెప్పారు. త్రేతాయుగంలో అధర్మం ఒక పాదంపై ప్రవేశించి, దానిని సమతుల్యం చేయడానికి శ్రీరామచంద్రుడు అవతరించారని పేర్కొన్నారు. ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలు, అధర్మం అధర్మరం రెండు పాదాలలో సమాన స్థాయిలో ఉండగా, శ్రీకృష్ణుడు, అర్జునుడు, వంటి మహనీయులు ధర్మ రక్షణ కోసం కృషి చేశారని వివరించారు. ప్రస్తుతం కలియుగంలో అధర్మం మూడు పాదాలపై విస్తరించగా, ధర్మం ఒక్క పాదంపై నిలిచి పోరాడుతోందని తెలిపారు.
డాక్టర్ జీ జీవితం – సంఘ స్థాపన పునాది
ఈ నేపథ్యంలో ధర్మాన్ని స్థాపించడానికి సంఘటిత శక్తి అవసరమైందని, ఉగాది వంటి పర్వదినాలు జాతి పునర్నిర్మాణానికి ఆరంభాలుగా నిలుస్తాయని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డాక్టర్ కేశవ్ బాలిరాం హెగ్డేవార్ (డాక్టర్ జీ) జననం కూడా ఉగాది రోజునే జరగడం యాదృచ్ఛికం కాదని, దైవ సంకల్పమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
డాక్టర్ జీ బాల్యంలోనే దేశభక్తి చైతన్యం కలిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారని, యూనియన్ జెండాను దించేందుకు ప్రయత్నించడం, బ్రిటిష్ ఇచ్చిన మిఠాయిని తిరస్కరించడం వంటి సంఘటనలను వివరించారు. వందేమాతరం నినాదం దేశ స్వాతంత్ర్యోద్యమానికి శ్వాసగా నిలిచిందని, బ్రిటిష్ పాలకులను వణికించిన శక్తి అదే అని చెప్పారు. స్వాతంత్ర్యం కొద్దిమంది నేతల వల్ల రాలేదని, అనేకమంది విప్లవకారుల త్యాగ ఫలితమని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రాంతం విప్లవోద్యమానికి కేంద్రంగా నిలిచి, అనేకమంది దేశభక్తులు ఉరితాడును సైతం స్వాగతిస్తూ ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు.
డాక్టర్ జీ 1925లో విజయదశమి రోజున సంఘాన్ని స్థాపించి, బాల స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరింపజేశారని చెప్పారు. సంస్థ ప్రారంభ దశలో పేరులేకుండానే పని చేసిన విధానం, తరువాత స్వయంసేవకుల సమిష్టి నిర్ణయంతో “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్”గా రూపుదిద్దుకోవడం అరుదైన గొప్ప విషయమని తెలిపారు.
ఎమర్జెన్సీ గాయాలు – స్వయంసేవకుల త్యాగాలు
దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడు వంటి ప్రాంతాల్లో భాషా సమస్యలు ఉన్నప్పటికీ, కేవలం సైకిల్ తొక్కుతూ, తిండి తిప్పలు మానేసి సంఘాన్ని నిలబెట్టిన దాదావుప్ పరమాండ్ వంటి ప్రచారకుల జీవితం ఆదర్శనీయమని రమేష్ పేర్కొన్నారు. 1975 ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావిస్తూ, అప్రజాస్వామిక పాలనలో స్వయంసేవకులు పడిన హింస వర్ణనాతీతమన్నారు. చెప్పులు ఇంటి ముందర వరుసగా ఉంటే అది స్వయంసేవకుని ఇల్లే అని పోలీసులు గుర్తుపట్టేంత క్రమశిక్షణతో వారు ఉండేవారని, జైళ్లలో మగ్గినా దేశం కోసం వెనకడుగు వేయలేదని తెలిపారు. ఒక స్వయంసేవకుని కుటుంబం పోలీసుల హింసకు గురై, చిన్న పాప అనారోగ్యం పాలైనా సడలని ఆత్మవిశ్వాసంతో సంఘ కార్యానికి అంకితమైన గాథలను వివరిస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. హిందూ దేశం అంటే కేవలం ఒక మతం కాదని, ఎవరైతే ఈ దేశాన్ని మాతృభూమిగా గౌరవిస్తారో, దేశ శత్రువులను తమ శత్రువులుగా భావిస్తారో వారంతా హిందువులేనని చరిత్ర చెబుతున్నాయని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1942లోనే అప్రకటిత ప్రధానిగా 18 దేశాల గౌరవం పొందారని గుర్తుచేశారు.
డాక్టర్ జీ సాధారణ జీవన విధానాన్ని అనుసరించి, వ్యక్తిగత సౌకర్యాలకంటే సంఘ నిర్మాణాన్ని ప్రధానంగా పరిగణించారని చెప్పారు. ఆయన తరువాత గురూజీ వంటి మహనీయులు దేశవ్యాప్తంగా సంఘాన్ని విస్తరించారని వివరించారు. ఎమర్జెన్సీ సమయంలో సంఘ కార్యకర్తలు ఎదుర్కొన్న హింస, అరెస్టులు, కుటుంబాలపై జరిగిన దౌర్జన్యాలను ప్రస్తావిస్తూ, అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా సేవ కొనసాగించారని అన్నారు.
ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించినప్పటికీ మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టచ్ స్క్రీన్‌లు పెరిగినప్పటికీ మనుషుల మధ్య ‘టచ్’ తగ్గిందని వ్యాఖ్యానించారు. అవసరానికి మించి టెక్నాలజీ వినియోగం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.
స్వదేశీ జీవన విధానం, స్వభాష ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ తెలుగు భాషను ప్రోత్సహించాలని సూచించారు. ఇంట్లో తయారైన ఆహారం, సహజ జీవనశైలి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగం, ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని ఉదాహరణలతో వివరించారు.
RSS Ugadi Utsavam : పంచ పరివర్తన లక్ష్యాలతో సమాజ మార్పు
సంఘ కార్యకర్తలు “పంచ పరివర్తన” లక్ష్యాలతో సమాజ మార్పుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ధర్మ పరిరక్షణ, సమాజ నిర్మాణం, దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. మహిళా శక్తి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, స్వయంసేవకుల వెనుక ఉన్న బలం కుటుంబ వ్యవస్థ అని, ముఖ్యంగా మహిళల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
చివరగా, ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిస్తూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుమార్ ఇంజనీర్స్ ప్రొప్రైటర్ శ్రీ ఉదయ్ క్షీరసాగర్, మహానగర సంఘచాలక్ డా. బందెల మోహనరావు, కాశిబుగ్గ సంఘ్‌చాలక్ చామర్తి ప్రభాకర్ తోపాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు పాల్గొన్నారు.
జాతీయవాద వార్తలు, దేశభక్తి కథనాలు, తాజా టెక్నాలజీ, లైఫ్ స్టైల్ విశేషాల కోసం వందేభారత్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి. మా తాజా అప్‌డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి: వాట్సప్ ఛానల్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్)
ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశహితం కోరుకునే మీ స్నేహితులతో ఈ కథనాన్ని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

