Posted in

RSS | సేవ, క్రమశిక్షణ, దేశభక్తి – సంఘ్ మూల సూత్రాలు

Spread the love

  • హిందూ సమాజ ఐక్యతే బలమైన భారత నిర్మాణానికి పునాది
  • సమాజంలో కుట్రలు – హిందువులను విడదీసే ప్రయత్నాలు పెరుగుతున్నాయ్
  • కుటుంబ వ్యవస్థే భారత బలం – ఇత‌ర దేశాలకు ఆదర్శం
  • ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి

Waragnal : దేశ నిర్మాణంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) హిందూ సమాజ ఐక్యతను ముందుకు తీసుకువెళ్తోంద‌ని ఆర్ఎస్ఎస్‌ వ‌రంగ‌ల్ విభాగ్ స‌హ‌ కార్య‌వాహ్, కేయూ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి అన్నారు. భారతదేశాన్ని బలమైన, సుసంస్కృత, ఆత్మవిశ్వాసంతో కూడిన హిందూ రాష్ట్రముగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని ఆయ‌న పేర్కొన్నారు. వరంగల్ 16 వ డివిజన్ కీర్తి నగర్ లోని కోటిలింగాల బస్తీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య‌ వక్తగా కాకతీయ విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి పాల్గొని, ఆర్ఎస్ఎస్ స్థాపకులు హెడ్గేవార్ జీవిత విశేషాలను వివరించారు. స్వాతంత్ర్యానికి ముందే ఆయన కాంగ్రెస్, హిందూ మహాసభలలో పాల్గొని దేశానికి సేవ చేశారని, అనేక సార్లు జైలుకెళ్లారని తెలిపారు. కేవలం స్వాతంత్ర్యం సంపాదించుకోవడమే కాకుండా, దానిని నిలబెట్టుకోవడానికి, మళ్లీ దేశం పరాయి పాలనలోకి వెళ్లకుండా నిరోధించడానికి స్వయంసేవకులను తీర్చిదిద్దే వేదికగానే సంఘ్‌ను హెడ్గేవార్ ప్రారంభించారని గుర్తుచేశారు.

అయోధ్య రామమందిర నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. సమాజాన్ని, సాధు సంతులను, అనేక హిందూ సంఘాలను చైతన్యవంతం చేసి ప్రతి హిందువు రామమందిర నిర్మాణంలో భాగస్వామి అయ్యేలా చేశారు. అలాగే తిరుమలలో అన్యమత ప్రచారం జరగకుండా స్వ‌యం సేవ‌కులు తిరుపతి పరిరక్షణ సమితి ద్వారా కృషి చేసి హిందూ సంప్రదాయాలను కాపాడారు. దేశ సమగ్రతకు అడ్డుగోడగా నిలిచిన 370 ఆర్టికల్ రద్దు కావడంలో సంఘ్ సమాజాన్ని, దేశ ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ మూడు అంశాల్లోనూ సంఘ్ జాతీయ సమైక్యత, సాంస్కృతిక పరిరక్షణ, దేశ భక్తి కోసం పోరాడి చారిత్రక విజయాలు సాధించింద‌ని తెలిపారు.

నేటి స‌మాజంలో హిందూ స‌మాజాన్ని విధ్వంసం చేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. హిందువుల‌ను కులాలు, వ‌ర్గాల‌పేరుతో విడ‌దీసేందుకు య‌త్నాలు జ‌రుగుతున్నాని పేర్కొన్నారు.

సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలు కలిసిపోవడం ద్వారానే సమాజ శక్తివంతం అవుతుందని పిలుపునిచ్చారు. మ‌న కుటుంబ వ్య‌వ‌స్థ బ‌ల‌మైన‌ద‌ని ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని ప్రొఫెస‌ర్ ఇస్తారి తెలిపారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం ద్వారా వ్యక్తిత్వ వికాసమే సంఘ్ కార్యకలాపాల మూలసూత్రంగా ఉందని చెప్పారు. రాజకీయ ఆధారంగా కాకుండా, సాంస్కృతిక, సామాజిక పునర్నిర్మాణం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని ఆర్ఎస్ఎస్ నమ్ముతోంద‌న్నారు.

కుటుంబ వ్యవస్థను ప‌రిర‌క్షించుకోవాలి..

విదేశీ శక్తులు భారతీయ కుటుంబ వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి, కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రొఫెస‌ర్ మామిడాల ఇస్తారి హెచ్చరించారు. విదేశీ వస్తువుల వినియోగంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, రూపాయి విలువ పడిపోతుందని చెప్పారు. అందువల్ల స్వదేశీ విధానం అనుసరించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. కులాల పేరుతో హిందువులను విడగొట్టే ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుందని, సామాజిక సమరసత ఆచరించడం వలన అన్ని కులాలు ఐకమత్యంగా కలిసి ఉండవచ్చని అన్నారు. నిత్యజీవితంలో స్వదేశీ జీవన విధానాన్ని అనుసరించడం వల్ల దేశము స్వావలంబత పెరుగుతుందని తెలిపారు. నీటిని పొదుపుగా వాడడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, వ్యవసాయంలో పురుగు మందులకు బదులు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి వాటి ఆచరణ వలన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని అన్నారు.

కార్య‌క్రమంలో కాశిబుగ్గ న‌గ‌ర సంచాల‌క్ చామ‌ర్తి ప్ర‌భాక‌ర్ రావు, నూతి శ్రీనాథ్‌, బ‌స్తీ ప్ర‌ముఖ్ రావుల‌ప‌ల్లి వేణు, స‌భావ‌త్‌ గ‌ణేష్‌, స‌భావ‌త్‌ నాగ‌రాజు, ఆడెపు కిశోర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *