కేయూ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారి
Warangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మెరుగు సుధాకర్ (Dr. Merugu Sudhakar) మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్లోనే అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు.
ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్టర్ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం హిందువుల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, సమాజంలో వ్యాప్తి చెందిన రుగ్మతలను తొలగించడానికి డా. హెడ్‌గేవార్ గారు 100 సంవత్సరాల క్రితం సంఘ్ శాఖను ప్రారంభించారని గుర్తు చేశారు. దేశంలో వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టి హిందువులను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మూఢ నమ్మకాలు, అంటరానితనం పేరుతో హిందూత్వంపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటికి ఒకే సమాధానం సామాజిక సమరసత సాధించడమే అని ఆయన స్పష్టం చేశారు.
“హిందూత్వంలో అంటరానితనం, అస్పృశ్యత, మూఢనమ్మకాలు లేవు. ఇవన్నీ అజ్ఞానపు కల్పితాలు మాత్రమే” అని ఆయన అన్నారు. వాల్మీకి, వ్యాసులు ఏ కులానికి చెందిన వారన్నది ముఖ్యం కాదని, వారు ప్రపంచానికి అందించిన రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి మహత్తర గ్రంథాలను ప్రపంచం పూజిస్తున్నదని గుర్తు చేశారు. వేదాలు “ఏకం సత్ విప్రా బహుదావదంతి” అని చెబుతున్నాయని, అన్ని జీవరాసుల్లో ఒకే ఆత్మ ఉందని తెలియజేస్తున్నాయని వివరించారు.
డా. ఇస్తారి గారు యువతకు పిలుపునిస్తూ, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి దేశ పునర్నిర్మాణ దిశగా ముందడుగు వేయాలని సూచించారు. కుల, మత, ప్రాంతాల పేరుతో దేశాన్ని విభజించాలనే కుట్రలు దేశద్రోహులు చేస్తున్నారని, అలాంటి పన్నాగాలను పటాపంచలు చేసి దేశ ఏకతా కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.