Registration Charges | తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ నుంచి సవరించిన చార్జీలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నిజానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచే అమలు చేయాలని భావించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జూన్‌లో షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక అందజేశారు. కాగా ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించలేదు. ఈ క్రమంలో ధరల సవరణపై అధ్యయన బాధ్యతలను ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి, ఎక్కడ ఎంత మేరకు పెంచే అవకాశం ఉందో, ఎక్కడ తగ్గించాల్సి ఉంటుందో సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేట్ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పనులు ప్రారంభం కావడం, ఫ్యూ చర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాల నేపథ్యంలో దాని పరిసర ప్రాంతాల్లో భూముల సవరణపైన అధ్యయనం చేసినట్టు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లోగా తాజా నివేదిక ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సమీక్ష చేసిన అనంతరం ఎంతవరకు ధరలను సవరించాలో నిర్ణయించనున్నట్లు సమాచారం. నవంబర్ మొదటి వారంలో పెంపును అమలు చేసే చాన్స్ ఉంది. ‘ఇది రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు కాదు. శాస్త్రీయంగా ధరల స్థిరీకరణ అని. స్థానిక పరిస్థితులను బట్టి చార్జీలు పెంచాలా లేదా తగ్గించాలా అనేది నిర్ణయం తీసుకొని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..