Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇకపై ‘తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కాదా?
Ration Cards | సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా రేషన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో రేషన్ కార్డు లేని నిరుపేదలు ఏ పథకాన్ని కూడా పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కేంద్రాలలో ( రేషన్ దుకాణాలు) సబ్సిడీ బియ్యం పొందేందుకు మాత్రమే చెల్లుబాటు అయ్యే కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్రువీకరించారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలను మంత్రివర్గ ఉపసంఘం రూపొందించనుంది.
గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బిఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు (Ration Cards )ను కలిగి ఉన్నవారికే అనేక సంక్షేమ పథకాలను వర్తింపజేసింది. అయితే, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ, త్వరలో జారీ చేయనున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుల నుంచి ప్రయోజనం పొందేందుకు తెల్ల రేషన్ కార్డు అవసరం లేదని తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. కొత్త విధానంలో సబ్‌కమిటీ సిఫార్సుల మేరకు అర్హులైన కుటుంబాలను గుర్తించి కొత్త రేషన్‌కార్డులు అందజేస్తారు. కొత్త విధానం అమలుకు ముందు ఈ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం అవసరం ఉంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..