Rain Report | రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rain Report | హైదరాబాద్ : తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని చెప్పింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇక ఈనెల 7న బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెప్పింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
హైదరాబాద్ లో..
Hyderabad Rain Report హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, వనపర్తి, మెదక్, నల్లగొండ, వరంగల్, సిద్దిపేట, మానుకోట, కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజెర్లలో 148 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అదే జిల్లా తల్లాడలో 120 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ పేర్కొంది.