General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్ కోచ్‌లు పెరిగాయ్..
General Class Coaches | న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో ఒంటికాలిపై గంటల కొద్దీ అవస్థలు పడుతూ ప్రయాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే రైళ్లలో జనరల్ (అన్ రిజర్వ్ డ్ ) కోచ్ లను పెంచాలని నిర్ణయించింది. ఇకపై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2,500 జనరల్ క్లాస్ కోచ్‌లను తయారు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్ సామర్థ్యం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు.
2,500 కొత్త కోచ్ ల తయారీ..
కాగా, ప్రస్తుతం రైళ్లలో రెండు జనరల్ కోచ్‌లు (General Class Coaches) ఉండగా.. వాటి సంఖ్య నాలుగుకు పెరుగుతుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఇప్పటిరకు జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు రెండు జత చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో జనరల్ కోచ్ (unreserved coaches) లో 150 నుంచి 200 మంది ప్రయాణించేలా వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రతీ రోజు అదనంగా ఐదు లక్షల మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణించ వచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు జనరల్ కోచ్‌ల పెంపు ప్రణాళికతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. దీనికోసం 1,377 స్లీపర్ క్లాస్ కోచ్‌లతోపాటు అదనంగా 2,500 జనరల్ కోచ్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారై అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో జనరల్ బోగిల్లో సంవత్సరానికి 18 కోట్ల మంది ప్రయాణించే అవకాశం కలుగుతుందని రైల్వే అధికారులు వివరించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..