Election 2024 | రాయ్ బరేలి నుంచి రాహుల్ పోటీ?
Rae Bareli : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోటలుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్యర్థల ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది పార్టీ నాయకత్వం. ఈ కీలకమైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.
1951 నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నందున రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైనదని పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ ఎంపీగా వరుసగా నాలుగు సార్లు పనిచేసిన సోనియా గాంధీ.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో పోటిచేయడానికి ప్రియాంక ఇష్టపడకపోవటం, కాంగ్రెస్ కంచుకోటల్లో అభ్యర్థులను ఎంపిక చేయడంలో అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంబించడం బీజేపీకి చక్కని అస్త్రంగా దొరికినట్లైంది. గాంధీలపై బిజెపి దాడి చేయడానికి అవకాశం చిక్కింది. అమేథీలో ఓడిపోతామనే భయంతోనే రాహుల్ సురక్షితమైన స్థానాలకు వలస వెళ్లాడని బీజేపీ ఇప్పటికే ఎద్దేవా చేసింది.
రాయ్ బరేలీ (Rae Bareli) లో “ప్రియాంక పోటీ చేయడానికి ఇష్టపడనందున, రాహుల్ గాంధీని పోటీకి దింపడం మినహా పార్టీకి వేరే మార్గం లేదు. ఈ స్థానాన్ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మూడుసార్లు పోటీ చేశారు. ఇందిరా భర్త ఫిరోజ్ గాంధీ కూడా 1952, 1957లో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు” అని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ అభ్యర్థిత్వంపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ నేత ఒకరు తెలిపారు. రెండు స్థానాలకు నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ మే 3. మే 20న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. కాగా, అభ్యర్థులను నిర్ణయించేందుకు తమ కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇచ్చిందని కాంగ్రెస్ తెలిపింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..