PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు చేసి, సర్దార్ పటేల్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఆ తర్వాత భారతదేశ ఐక్యత, క్రమశిక్షణ, సాంస్కృతిక వైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ ఏక్తా దివస్ సమరోహ్ జరిగింది.
X లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, భారత దేశ సమగ్రత వెనుక ఉన్న శక్తి సర్దార్ పటేల్ అని ప్రధాని మోదీ అన్నారు. “సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. భారతదేశ సమైక్యతకు చోదక శక్తిగా ఆయన నిలిచారు, తద్వారా మన దేశం నిర్మాణాత్మక సంవత్సరాల్లో దాని విధిని రూపొందించారు. జాతీయ సమగ్రత, సుపరిపాలన, ప్రజా సేవ పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఐక్యమైన, బలమైన, స్వావలంబన భారతదేశం అనే ఆయన దార్శనికతను నిలబెట్టాలనే మా సమిష్టి సంకల్పాన్ని కూడా మేము పునరుద్ఘాటిస్తున్నాము” అని ప్రధాని మోదీ పోస్ట్‌లో రాశారు.
సర్దార్ పటేల్ 550 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసారు.. ప్రధాని మోదీ
ఈ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 550 కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనానికి కృషి చేశారన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై ఆయన కాంగ్రెస్, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల దేశం బాధపడాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
“స్వాతంత్య్రం తర్వాత, సర్దార్ పటేల్ 550 కి పైగా సంస్థానాలను ఏకం చేయడం అనే అసాధ్యమైన పనిని సాధించారు. ఆయనకు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనే దార్శనికత అత్యంత ముఖ్యమైనది” అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తప్పిదం వల్ల దేశం బాధపడింది : PM Modi
సర్దార్ పటేల్ మొత్తం కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని కోరుకున్నారని, కానీ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దానికి ఒప్పుకోలేదని అన్నారు. “కాశ్మీర్‌ను ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండాతో విభజించారు. దశాబ్దాలుగా కాశ్మీర్‌పై కాంగ్రెస్ చేసిన తప్పుకు దేశం అగ్నికి ఆహుతైంది. కాంగ్రెస్ బలహీన విధానాల కారణంగా, కాశ్మీర్‌లో ఒక భాగం పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలోకి పోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. కాశ్మీర్‌తోపాటు దేశం ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది, అయినప్పటికీ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదం ముందు తలవంచింది” అని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
ఉగ్రవాదం, నక్సలిజంపై కఠిన వైఖరి
దేశంలో నక్సలిజాన్ని తన ప్రభుత్వం అంతం చేస్తుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు. భారతదేశంలో అక్రమ చొరబాట్లపై కాంగ్రెస్‌ను కూడా ప్రధాని తన పదునైన వ్యాఖ్యలలో విమర్శించారు. దేశం నుంచి ప్రతి చొరబాటుదారుడిని బహిష్కరించాలని తన ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిందని అన్నారు.
“దురదృష్టవశాత్తూ, సర్దార్ సాహిబ్ మరణం తరువాతి సంవత్సరాల్లో, ఆ కాలపు ప్రభుత్వాలు దేశ సార్వభౌమాధికారం పట్ల అదే గంభీరతను ప్రదర్శించలేదు. ఒకవైపు, కాశ్మీర్‌పై చేసిన తప్పులు, మరోవైపు, ఈశాన్యంలో తలెత్తే సమస్యలు, దేశవ్యాప్తంగా నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వ్యాప్తి దేశ సార్వభౌమాధికారానికి ప్రత్యక్ష సవాళ్లు అని అన్నారు. కానీ సర్దార్ సాహిబ్ విధానాలను అనుసరించడానికి బదులుగా, ఆ యుగపు ప్రభుత్వాలు వెన్నెముక లేని విధానాన్ని ఎంచుకున్నాయి” అని మోదీ అన్నారు.


