ఒడిశాలో మృత్యుఘోష
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు
278కి చేరిన మృతుల సంఖ్య
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని అధికారులు శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కటక్‌లోని ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం పెనువిషాదాన్ని నింపింది.
ఈ ప్రమాదంలో ఒక రైలు మరొకదానిపైకి బలంగా ఢీకొట్టింది. తద్వారా బోగీలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆపై ట్రాక్‌లు మెలితిప్పినట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా తెగిపోయిన అవయవాలు, చెల్లాచెదురుగా మృతదేహాలతో వాతావరణమంతా భీతిగొల్పే విధంగా మారింది.
ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ” రైలు పట్టాలు తప్పినప్పుడు నేను నిద్రపోతున్నాను. దాదాపు 10-15 మంది నాపై పడిపోయారు. నేను కోచ్ నుండి బయటికి వచ్చినప్పుడు, చుట్టూ అవయవాలు చెల్లాచెదురుగా కనిపించాయి, ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక చేయి.. ఒకరి ముఖం వికృతంగా ఉంది,” అని తెలిపాడు.
ఈ ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒకరోజు సంతాప దినంగా ప్రకటించారు .
పునరుద్ధరణ పనులపై దృష్టి
రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని, ఇప్పుడు పునరుద్ధరణ పనులపై దృష్టి సారించామని తెలిపారు. కాగా రైలు ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹ 2 లక్షలు మరియు స్వల్ప గాయాలైన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తామని వైష్ణవ్ ప్రకటించారు. Odisha Train Accident
ప్రధాని మోదీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి పరిహారం ప్రకటించారు.
48 రైళ్లు రద్దు
సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లోని హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా 48 రైళ్లు రద్దు చేశారు. 39 రైళ్ళను దారి మళ్లించారు. అలాగే 10 రైళ్లు షార్ట్ టర్మినేట్ చేశారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి
One thought on “ఒడిశాలో మృత్యుఘోష”