NPSs Vatsalya Scheme | పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తెరవవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుందని ఆర్థిక మంత్రి గతంలోనే ప్రకటించారు.
దేశంలోని ప్రజలందరికీ ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో ప్రవేశపెట్టిన ఎన్‌పీఎస్.. పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రజాదరణ పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్తరించాలని నిర్ణయిస్తూ మైనర్లకు కూడా వాత్సల్య స్కీమ్ వర్తింపజేస్తున్నారు.
కాగా సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana), పీపీఎఫ్ (PPF) వంటి పొదుపు పథకాలకు ఇది అదనం. ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ (NPSs Vatsalya Scheme )తో ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్‌పీఎస్ ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ సమకూరుతుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా వల్ల బాల్యం నుంచే పిల్లలకు పొదుపు అలవాటు చేయవచ్చు.
సాధారణంగా ఎన్‌పీఎస్‌లో టైర్-1, టైర్-2 ఖాతాలు ఉంటాయి. టైర్-1 ప్రాథమిక పెన్షన్ ఖాతా. ఇందులో చేరినప్పుడు విత్ డ్రాలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్-2లో స్వచ్ఛంద పొదుపు పథకం వంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80 సీసీడీ కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది సెక్షన్ 80 సీ పరిమితి రూ.1,50,000కు అదనం.. పదవీవిరమణ తర్వాత ఎన్‌పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుసుకోవచ్చు. మిగతా 40 శాతంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. దీనిద్వారా పదవీవిరమణ తర్వాత ఫెన్షన్ ను పొందేందుకు అవకాశం కలుగుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..