మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం
వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్
మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు.
మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది.
“ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది” అని చీఫ్ సెక్రటరీ తెలిపారు.
మయన్మార్ జాతీయులు శని, ఆదివారాల్లో మణిపూర్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం జిల్లాలోని ఏడు ప్రాంతాలైన లజాంగ్, బోన్సే, న్యూ సామ్తాల్, న్యూ లజాంగ్, యాంగ్నోంఫై, యాంగ్నోమ్‌ఫాయ్ సా మిల్, ఐవోమ్‌జాంగ్, మయన్మార్ సరిహద్దులోని అన్ని గ్రామాలలో ఉంటున్నారని ఆయన చెప్పారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు చెల్లుబాటు అయ్యే వీసా, ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ పౌరులు మణిపూర్‌లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని జోషి తెలిపారు.
ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అటువంటి వ్యక్తులందరికీ బయోమెట్రిక్‌లు, ఫోటోగ్రాఫ్‌లను కూడా తీసుకోవాలని చందేల్ జిల్లా డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని చీఫ్ సెక్రటరీ కోరారు.
కాగా, ఫిబ్రవరి 2021లో మయన్మార్‌లో మిలటరీ స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ దేశానికి చెందిన దాదాపు 35,000 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో వేలాది మంది మయన్మార్‌లు మిజోరంకు పారిపోయి వచ్చారు. మణిపూర్‌లో దాదాపు 5,000 మంది మయన్మారీస్ కూడా ఆశ్రయం పొందారు.
మణిపూర్‌కు దాదాపు 400 కి.మీ, మిజోరం మయన్మార్‌తో 510 కి.మీ కంచె లేని సరిహద్దును కలిగి ఉంది. దీనిక కారణంగా వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి