Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు.
మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించామని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నారని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాలను వస్తువులను విక్రయించే వారి కోసం ఒక నిర్ణయం తీసుకున్నామని విక్రమాదిత్య మీడియాకు తెలిపారు. .
వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రతపై ప్రజలు ఆందోళనలు, సందేహాలను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, యుపిలో అమలు అవుతున్న విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలని మేము నిర్ణయించుకున్నట్లు విక్రమాదిత్య తెలిపారు. ఇందులో విక్రేతలు తమ పేర్లు, ఐడిలను ప్రదర్శించాలని తప్పనిసరి చేశారు. ప్రతి దుకాణదారు, వీధి వ్యాపారులు తమ పేర్లను ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతకుముందు రోజు విక్రమాదిత్య తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒకపోస్టు పెట్టారు. “హిమాచల్ (Himachal Pradesh)లో, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రతి రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్ యజమాని తన IDని ప్రదర్శించాలి. అని పేర్కొన్నారు.
యూపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార కల్తీకి సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయి. దీనిపై స్పందించిన సీఎం ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత స్థాయి సమావేశంలో, హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు సహా అన్ని ఆహార కేంద్రాలను సమగ్రంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
యూపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు ఇవే..
- ఆహార కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
- ఆపరేటర్లు, యజమానులు, నిర్వాహకుల వివరాల ప్రదర్శన
- తప్పనిసరి CCTV కెమెరాలు ఉండాలి.
- ఆహార తయారీ, సర్వీస్ చేసేటపుడు సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి
- మానవ వ్యర్థాలు లేదా ఇతర హానికరమైన పదార్థాలను కలిపే వారి పట్ల జీరో-టాలరెన్స్ పాలసీ
- ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై తక్షణ చర్యలు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..