Saturday, August 30Thank you for visiting

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

Spread the love

Ghatkesar-Sanathnagar MMTS | ఘట్‌కేసర్ – సనత్‌నగర్ కొత్త MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెక్షన్‌లో కొత్త MMTS స్టేషన్లు నిర్మించాలనే డిమాండ్లు  కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు ఈ మార్గంలో  పెద్ద సంఖ్యలో ప్రతీరోజు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్,  అల్వాల్‌లోని లయోలా కాలేజీ సమీపంలో స్టేషన్‌ను నిర్మించాలని MMTS రైలు స్టేషన్ సాధన సమితి,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  రైల్వే అధికారులను కోరారు.

Ghatkesar-Sanathnagar MMTS : ఘట్‌కేసర్-సనత్‌నగర్ బై-పాస్ లైన్‌లో కొత్త స్టేషన్‌ల కోసం స్థలాలను గుర్తించేందుకు తాత్కాలిక సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులను కోరారు.  “చెర్లపల్లి నుంచి ఉమ్దానగర్, లింగంపల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి గమ్యస్థానాలకు MMTS సేవలను విస్తరించడానికి అత్యవసర కార్యాచరణ ప్రణాళిక అవసరం. పదేళ్ల క్రితమే ఘట్‌కేసర్‌-సనత్‌నగర్‌ సెక్షన్‌లో ఆరు కొత్త స్టేషన్ల కోసం ప్రణాళికలు రూపొందించారు. అయితే, కొత్త కాలనీలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు పెరిగిపోవడంతో  అదనపు స్టేషన్ల అవసరం పెరిగింది, ”అని సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.

హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, లయోలా అకాడమీ విద్యార్థులతో సహా నివాసితులు తమ ప్రాంతాలైన ఉప్పరిగూడ, ఆనంద్‌బాగ్, అల్వాల్‌లోని లయోలా కాలేజీ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌లను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.  సికింద్రాబాద్‌లోని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవడంతో రైల్వే అధికారులు కూడా అల్వాల్‌ లయోలా కాలేజీ వద్ద రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ను సందర్శించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. త్వరలో ప్రధాన కార్యాలయానికి నివేదిక అందజేస్తామని తెలిపారున. లయోలా కాలేజ్ అల్వాల్ వద్ద కొత్త MMTS రైలు స్టేషన్ ఆవశ్యకతను స్థానికులు హైలైట్ చేశారు.

“ప్రస్తుతానికి సమీపంలో ఉన్న MMTS రైలు స్టేషన్లు, భూదేవి నగర్,  సుచిత్ర చాలా దూరంగా ఉన్నాయి, దీని వలన స్థానిక నివాసితులు MMTS రైలు సేవలను ఉపయోగించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.  లెవెల్ క్రాసింగ్ సమీపంలోని ప్రాంతంలో దాదాపు 30 కాలనీలు,  10 కళాశాలలు ఉన్నాయి, లయోలా అకాడమీ అతిపెద్దది, సుమారు 10,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.  కొత్త స్టేషన్లను నిర్మించాలని కోరుతూ  స్థానికులతోపాటు వివిధ సంఘాల నుంచి వినతులు స్వీకరించామని,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయితే ఈ అసోసియేసన్ సభ్యులు సూచించిన మార్గాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *