Festive Season | రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝలక్ ఇవ్వనుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్ లేని ప్రయాణికులను తనిఖీ చేయడానికి, పోలీసులతో రైల్వే సిబ్బందిని విస్తృతస్థాయిలో మోహరించనుంది. అక్టోబర్ 1 నుండి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టిక్కెట్ లేని, అనధికారిక ప్రయాణికులపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది.
పండుగ రద్దీ నేపథ్యంలో వివిధ రైల్వే డివిజన్లలో రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న రైల్వే కమర్షియల్ అధికారులతో పాటు పోలీసులు కూడా తనిఖీల్లో ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. “ఘజియాబాద్, కాన్పూర్ మధ్య మా ఇటీవలి ఆకస్మిక తనిఖీలో, వివిధ ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో ఏసీ కోచ్‌లలో వందలాది మంది పోలీసులు ఎలాంటి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి జరిమానా విధించినప్పుడు, మొదట వారు చెల్లించడానికి నిరాకంచారని, అంతేకాకుండా తీవ్రస్థాయిలో మమ్మల్ని బెదిరించారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
పండుగల సీజన్ లో 6000 ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్ (Festive Season) సమీపిస్తున్న తరుణంలో దసరా, దీపావళి, ఛత్ పండుగలకు ప్రయాణించే కోటి మంది ప్రయాణికుల కోసం దాదాపు 6,000 ప్రత్యేక రైళ్ల (Special Trains) ను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యేక రైళ్లతో పాటు, 108 రెగ్యులర్ రైళ్లలో అదనపు జనరల్ కోచ్‌లను జతచేశామని తెలిపారు. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా అదనంగా 12,500 కోచ్‌లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..