Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామన్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు..!
Election code | బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్ చేసి శివకుమార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీకే శివకుమార్ శనివారం తన సోదరుడు డీకే సురేష్ తరఫున బెంగళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
డీకే సురేష్ బెంగళూరు రూరల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున ప్రచారం చేస్తూ శివకుమార్ మాట్లాడారు. తన సోదరుడు సురేష్‌ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగు నీటిని తరలించి నగర ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. అయితే డీకే శివకుమార్ ఇచ్చిన ఈ హామీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటు వేస్తే నీళ్లు ఇస్తామని చెప్పడం ఓటర్లను ప్రలోభపెట్టడమేనని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ వేసవిలో బెంగళూరులో తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతోంది. నగర ప్రజలకు రోజుకు 2,600 నుంచి 2,800 మిలియన్ లీటర్ల తాగు నీటి అవసరం ఉండగా.. ప్రస్తుతం అందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..