Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. ఇక్కడి పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వినాయక చవితి పండుగలు ముఖ్యమైనవి. ఇందులో పల్లెల్లో కనిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశస్యం కలిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇది కూడా మట్టి, పూలతో తెలంగాణ ఆటపాటలతో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు జరుపుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు పిల్లలు బొడ్డెమ్మను కొలుస్తూ గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు బొడ్డెమ్మ ఆడిన తర్వాత బొడ్డెమ్మను దగ్గరలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని చోట్ల బొడ్డెమ్మను చేసుకునేవారు ప్రసాదాలను కూడా పంచుకుంటున్నారు.
వరంగల్ లో ఉత్సాహంగా బొడ్డెమ్మ వేడుకలు#dasara2024 #bathukamma #keerthinagar #NimishambaDevi pic.twitter.com/1XzSCZsW0T
— Vande bhaarath (@harithamithra1) September 25, 2024
బొడ్డెమ్మను చేసుకునేవారు చెరువు దగ్గరకు వెళ్లి పుట్ట మట్టి తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తారు. ఆపై ఒక చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు. తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి లేదా ఆవుపేట అలికి.. బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో పాటు పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా తొమ్మిది రోజులు చేస్తారు. దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు చేస్తారు.
బొడ్డెమ్మకు ఎన్నో పేర్లు..
Boddemma Vedukalu : బొడ్డెమ్మకు పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లు కూడా ఉన్నాయి. బొడ్డెమ్మను కొందరు పీటపై చేస్తే మరికొందరు పందిరి వేస్తారు. తొమ్మిది రోజుల వేడుకల్లో చివరిరోజు.. చేసి గౌరీదేవికి నైవేద్యం పెట్టి తర్వాత పిల్లలకు తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను చేసి పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజలు చేసి ఆటపాటల తర్వాత చివరగా బొడ్డెమ్మను నిద్రపుచ్చే పాటలను పాడుతారు. ఆటపాటల తరువాత తెచ్చుకున్న ఫలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా తొమ్మిది రోజులు ఆడిన తర్వాత చివరి రోజున సాగనంపే పాటలు పాడి సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. ఇక బొడ్డెమ్మ పండుగ పూర్తయిన మరుసటి రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంబమవుతాయి. దానిని కూడా పిల్లలు తొమ్మిది రోజులపాటు ఆడుతారు. కాగా తెలంగాణా పల్లెల్లో కొన్ని చోట్ల బొడ్డెమ్మ సంబరాలు కొనసాగుతుండగా అక్టోబరు 2 నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. చివరిరోజు పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ ముగిసిన తర్వాత దసరా పండుగ వస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..