Contract Employees : తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ జారీ చేసిన జీఓ 16 నంబర్‌ను రద్దు చేసింది. ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని భావిస్తున్న ఉద్యోగుల భవిష్యత్ మళ్లీ గందరగోళంలో పడింది. క్రమబద్ధీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం G.O 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను (Contract Employees ) రెగ్యూలరైజ్ చేసింది. అయితే తాజా హైకోర్టు తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ అయోమయంలో పడినట్లయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు వెల్లడించారు. కాగా దీనిపై హైకోర్టు నుంచి తమకు ఆర్డర్ కాపీ వస్తేనే స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సెక్షన్ 10ఏ ప్రకారం జీవో 16ను కెసిఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని పేర్కొంటూ నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అయితే తీర్పు ఇచ్చిన దానిలో హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ‘రెగ్యులరైజ్ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించవచ్చు’ అని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. శాశ్వత ఉద్యోగులు కాస్త మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారారు.
క్రమబద్దీకరణ పొందిన ఉద్యోగులు
- జూనియర్ లెక్చరర్లు 2,909 మంది
- జూనియర్ లెక్చరర్లు (ఒకేషనల్) 184 మంది
- డిగ్రీ లెక్చరర్లు 270 మంది
- పాలిటిక్నిక్ లెక్చరర్లు 390 మంది
- సాంకేతిక విద్యాశాఖలో అటెండర్లు 131 మంది
- వైద్య ఆరోగ్య శాఖలో వైద్య సహాయకులు 837 మంది
- ఫార్మాసిస్టులు 158 మంది
- ల్యాబ్ టెక్నీషియన్లు 179 మంది
- సహాయ శిక్షణ అధికారులు 230 మంది