జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..
జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. “జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది” అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు.
జూలై 27న ఏఎస్‌ఐ (Archaeological Survey of India) సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై తీర్పును అలహాబాద్ కోర్టు ఆగస్టు 3కి రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.. అంతకు ముందు జులై 21న వారణాసి కోర్టు ఏఎస్‌ఐని అవసరమైన చోట తవ్వకాలతో సహా సర్వే నిర్వహించాలని, దేవాలయం ఉన్న స్థలంలో మసీదు నిర్మించబడిందో లేదో నిర్ధారించాలని ఆదేశించింది.
ASI జులై 24న సర్వేను ప్రారంభించింది, అయితే సర్వేను నిలిపివేయాలని కోరుతూ మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కొన్ని గంటల వ్యవధిలోనే స్టే విధించింది , దిగువ కోర్టు ఆదేశంపై కమిటీకి అప్పీల్ చేయడానికి సమయం ఇచ్చింది.
సర్వే, తవ్వకం వల్ల నిర్మాణానికి నష్టం వాటిల్లుతుందని మసీదు కమిటీ తరపు న్యాయవాది వాదించారు. సర్వేతో నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
హిందూ చిహ్నాలను రక్షించాలని తాజా విజ్ఞప్తి
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని “హిందూ చిహ్నాలు’’ను రక్షించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జ్ఞాన్‌వాపి-శృంగార్ గౌరీ కేసులో పిటిషనర్లలో ఒకరైన రాఖీ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
శృంగార్ గౌరీ కేసులో వారణాసి కోర్టు తీర్పు వెలువడేంత వరకు హిందువులు కాని వారిని ప్రాంగణంలోకి రానీయకుండా నిషేధించాలని, జ్ఞాన్వాపీ ప్రాంగణంలోని హిందూ చిహ్నాలను రక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని పిఐఎల్‌లో పేర్కొన్నారు. . ఈ కేసు ఆగస్టు 7న విచారణకు రానుంది.
జ్ఞానవాపి మసీదులో హిందూ దేవీ (శృంగేరీ గౌరి) , దేవతలను పూజించేందుకు అనుమతించాలని కొందరు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో ఇది హిందూ ఆలయమని, ఇక్కడి శృంగేరి గౌరిని ప్రతీరోజూ పూజించేందుకు అనుమతించాలని వీరు కోరారు. దీంతో కోర్టు వీడియోగ్రాఫిక్ సర్వే చేయాలని 2022లో ఆదేశించింది. ఈ సర్వేలో గుండ్రటి నిర్మాణం కనిపించింది. అది శివలింగం అని హిందువులు చెప్తుండగా, ఫౌంటెన్ అని ముస్లింలు వాదించారు. శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
#WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09
— ANI (@ANI) August 3, 2023