- ప్రజాస్వామ్య దేవాలయాన్ని వణికించిన రోజు
- 9 మంది వీర సైనికుల అమరత్వం
- కుట్రలో భాగమైన అఫ్జల్ గురుకు మరణశిక్ష.
2001 Parliament Attack | డిసెంబర్ 13, 2001. సరిగ్గా 24 ఏళ్ల క్రితం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజులలో ఒకటిగా నిలిచింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఐదుగురు పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు కేవలం 45 నిమిషాల పాటు బుల్లెట్లతో విరుచుకుపడి, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ దాడిలో 9 మంది వీర సైనికులు అమరులయ్యారు. దాడి జరిగిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ వెళ్లిపోయినప్పటికీ, 200 మందికి పైగా ఎంపీలు, మంత్రులు పార్లమెంట్ భవనం లోపలే ఉన్నారు.
ఉగ్రదాడి ఎలా జరిగింది? (11:30 AM)
ఉదయం 11:30 గంటల ప్రాంతంలో, ఉపరాష్ట్రపతి భద్రతా దళాలు ఆయన కోసం వేచి చూస్తుండగా, ఐదుగురు ఉగ్రవాదులు తెలుపు రంగు అంబాసిడర్ కారులో 12వ నంబర్ గేట్ ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నిరాయుధులుగా ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే, ఉగ్రవాదుల కారు ఉపరాష్ట్రపతి కారును ఢీకొట్టింది. దీంతో సర్వత్రా భయాందోళనలు చెలరేగగా, భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను వెంబడించడం ప్రారంభించారు.
2001 Parliament Attack : పార్లమెంట్ పై కాల్పుల వర్షం
కారు ఢీకొనడంతో భయపడిన ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న AK-47లు, హ్యాండ్ గ్రెనేడ్లతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వారి వీపు, భుజాలపై సంచులు ధరించి ఉన్నారు. పార్లమెంట్ ప్రాంగణం మొత్తం కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. ఉగ్రవాదుల మొదటి దాడి అంబాసిడర్ కారును అడ్డుకోవడానికి ప్రయత్నించిన నలుగురు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. కాల్పులతో పాటు పేలుడు శబ్దం కూడా వినిపించింది. దాడిని గుర్తించిన వెంటనే పార్లమెంట్ భవనం యొక్క అన్ని తలుపులు మూసివేయబడ్డాయి. లోపల ఉన్న ఎంపీలు, మంత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
45 నిమిషాల ఆపరేషన్ – ఐదుగురు ఉగ్రవాదులు హతం
భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులను ఎదుర్కొన్నాయి. ఐదుగురు ఉగ్రవాదులలో ఒకరు గేట్ నంబర్ 1 నుంచి సభలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, భద్రతా దళాల కాల్పుల్లో అక్కడే మరణించాడు. మిగిలిన నలుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 4 వైపు వెళ్లడానికి ప్రయత్నించి, తిరిగి గేట్ నంబర్ 9 చేరుకున్నారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని చుట్టుముట్టడంతో, ఆపరేషన్ గేట్ నంబర్ 9 కి పరిమితమైంది. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన చివరి ఉగ్రవాది గేట్ నంబర్ 1 వైపు పరిగెత్తగా, అతనిపై కాల్పులు జరిపిన తర్వాత అతని ఆట కూడా ముగిసింది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈ రక్తపాత ఆపరేషన్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది, ఇందులో ఐదుగురు ఉగ్రవాదులూ హతమయ్యారు.
9 మంది వీర సైనికుల అమరత్వం
ఉగ్రవాదులతో జరిగిన ఈ భీకర పోరాటంలో, పార్లమెంట్ హౌస్ గార్డులు మరియు ఢిల్లీ పోలీసు సిబ్బందితో సహా మొత్తం 9 మంది వీర సైనికులు అమరులయ్యారు. వారి త్యాగాలు దేశం ఎప్పటికీ మరువలేనివి.
కేసు విచారణ & అఫ్జల్ గురు శిక్ష
దిల్లీ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో ఈ దాడికి పాకిస్తాన్ నుండి మార్గదర్శకత్వం లభించిందని తేలింది. దాడికి ప్రధాన సూత్రధారులుగా భావించిన అఫ్జల్ గురు, SAR గిలానీ, అఫ్షాన్ గురు, షౌకత్ హుస్సేన్ లను అరెస్టు చేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, సుప్రీంకోర్టు SAR గిలానీ, అఫ్షాన్ గురులను నిర్దోషులుగా ప్రకటించింది. షౌకత్ హుస్సేన్ శిక్ష రద్దు చేశారు. ప్రధాన సూత్రధారిగా భావించిన అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించారు.


