తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మార్చురీలో భద్రపరిచిన ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి.
వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్ క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు కాగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం సమయంలో, అతని శరీరంలోని భాగాలను ఎలుకలు తినేశాయని గమనించిన అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు నిరసన తెలిపారు. మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఆసుపత్రిలో మర్యాదగా వ్యవహరించాలంటే అందరికీ లంచం ఇవ్వాల్సి వస్తోందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పై అంతస్తు నుంచి కిందిస్థాయి వరకు లంచాలు ఇవ్వాల్సిందే.. ఆస్పత్రిలో మృతదేహాలకు కూడా భద్రత లేదు. అయితే ఆసుపత్రి అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. మార్చురీలో ఎలుకలు లేవని స్పష్టంచేశారు.