ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..
మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది..
సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె “తప్పిపోయిన” బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు.
పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి అదృశ్యంపై ఫిర్యాదు చేసింది. కాగా మహిళ పనిచేసిన నిర్మాణ స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు.. చిన్నారి ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లడం కనిపించలేదు. దీని ఆధారంగా చిన్నారి తల్లి ఉన్న ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని నిర్ధారించుకున్నారు. దీంతో చిన్నారి అదృశ్యంపై పోలీసులు మహిళను గట్టిగా ప్రశ్నించగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది.
దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రప్పించి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. చివరకు సదరు మహిళ తన ప్రియుడే కిడ్నాప్ చేశాడని ఆరోపించింది. జార్ఖండ్ లో నివాసముంటున్న తన ప్రేమికుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని మహి పోలీసులకు చెప్పింది.
పోలీసులు మహిళ ప్రియుడిని సంప్రదించారు.. కానీ అతడు సూరత్ ప్రాంతానికి వచ్చినట్లు ఆధారాలేవీ కనిపించలేదు. తానెప్పుడూ సూరత్ కు రాలేదని పోలీసులకు సమాచారం అందించాడు.
కొడుకును చంపినట్లు ఒప్పుకున్న మహిళ
పిల్లవాడు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు గానీ, వేరెవరూ అతడిని కిడ్నాప్ చేసినట్లు గానీ పోలీసులకు ఎటువంటి క్లూ లభించకపోవడంతో వారికి ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది. చివరకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. తల్లిని గట్టిగా నిలదీయడంతో తన బిడ్డను తానే చంపినట్లు ఆమె అంగీకరించింది. అయితే మృతదేహాన్ని ఎక్కడ దాచావని ప్రశ్నించగా.. తొలుత తప్పుడు సమాచారం అందించింది. అచ్చం
తొలుత ఆ మహిళ చిన్నారి మృతదేహాన్ని గొయ్యిలో పూడ్చిపెట్టానని చెప్పింది. అయితే ఆ స్థలాన్ని తవ్విచూడగా అక్కడ ఏమీ దొరకలేదు. మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు పోలీసులకు చెప్పగా, అక్కడ కూడా పోలీసులకు ఏమీ కనిపించలేదు.
ఇక పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. తమదైన శైలిలో విచారించగా నిర్మాణ స్థలంలోని టాయిలెట్ కోసం తవ్విన గొయ్యిలో మృతదేహాన్ని విసిరినట్లు మహిళ వెల్లడించింది. దీంతో వెంటనే చిన్నారి మృతదేహాన్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కొడుకును ఎందుకు చంపింది?
తన కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని దాచిపెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా, తాను జార్ఖండ్ కు చెందిన వ్యక్తినని, అక్కడ తనకు ప్రేమికుడు ఉన్నాడని మహిళ వివరించింది. ఆమె తన బిడ్డతో వస్తే అంగీకరించబోనని అతడు చెప్పాడని పేర్కొంది.
ప్రేమికుడి నుంచి ఆదరణ పొందేందుకు ఆ మహిళ తన కుమారుడిని హత్య చేసింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఎలా దాచాలో తెలుసుకోవడానికి దృశ్యం సినిమా చూసి దాన్నే ఫాలో అయింది.
‘డెడ్ బాడీని దాచేందుకు దృశ్యం సినిమా చూశాను’
“దృశ్యం” చిత్రంలో.. ఓ వ్యక్తిని హత్య చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని గొయ్యిలో పాతిపెడతారు. పోలీసులు గానీ, ఇతరులు గానీ ఎవరూ కనిపెట్టలేరు. ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల పోలీసులు తనను పట్టుకోలేరని సదరు మహిళ నమ్మింది. ఇలా చేసి జార్ఖండ్ లోని తన ప్రేమికుడిని కలుసుకోవచ్చని ఆ మహిళ అభంశుభం తెలియని తన కన్న కొడుకునే కడతేర్చింది.
చివరకు సీన్ రివర్స్ అయి కటకటాల వెనక్కి వెళ్లిపోయింది..