Saturday, August 30Thank you for visiting

నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

Spread the love

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్

హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు.

వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే నష్టంతో పాటు, తద్వారా దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యాపారస్తులకు వివరించి చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైన వాహనాల కొనుగోలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అధికంగా వినియోగించే ద్విచక్ర వాహనాలను దొంగల నుంచి కొనుగోలు చేసి వాటిని తుక్కు రూపంలో తరలించడం మానుకోవాలని సీపీ తెలిపారు.

పాత ఇనుప సామగ్రి, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ వ్యాపారులు ముఖ్యంగా ఏదైనా వాహనం కొనుగోలు చేసేటపుడు తప్పనిసరిగా వాహనం విక్రయించే వ్యక్తులకు సంబంధించి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో పాటు, వారి సెల్ ఫోన్ నంబర్లు తీసుకోవాలని సూచించారు. వాహనాల క్రయ విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలను పాటిస్తూ, పకడ్బందీగా రికార్డులను రూపొందించుకోవాలని, ముఖ్యంగా ఒరిజినల్ పత్రాలు ఉంటేనే వాహనాలను కొనుగోలు చేయాలని, ప్రతీ వ్యాపార కేంద్రంలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా వ్యాపారులు చట్టవ్యతిరేకంగా వాహన కొనుగోళ్లకు పాల్పడితే సదరు వ్యాపారస్థులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీలు రమేష్ కుమార్, మల్లయ్య, కిరణ్ కుమార్, సతీష్ బాబు, డేవిడ్ రాజుతో పాటు ఎస్సైలు పాల్గొన్నారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *