Tollywood News Updates | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఈ రోజు కలిశారు. పలు అంశాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాల మార్గాలు తదితర విషయాలపై సమాలోచన చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Shirtej) తీవ్రంగా గాయపడం లాంటి సంఘటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది.
సినీ పరిశ్రమ నుంచి పాల్గొన్నదెవరంటే..
ముఖ్యమంత్రితో సమావేశమైన సినీ ప్రముఖుల్లో అల్లు అరవింద్ (Allu Aravind), నాగార్జున, వెంకటేశ్, మురళి మోహన్, రాఘవేంద్రరావు, సి.కల్యాణ్, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను ఉన్నారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రివ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు.
సమావేశంలో కీలకాంశాలు
సినీ ప్రముఖులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పలు కీలకాంశాలపై మాట్లాడారని తెలుస్తోంది. ముఖ్యంగా తొక్కిసలాటకు కారణమైన అంశాలపై ప్రభుత్వం, సినీ పరిశ్రమ ప్రతినిధులు సమీక్షించారని సమాచారం. భద్రతా చర్యలు, టికెట్ విధానాన్ని మెరుగుపర్చడం, థియేటర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూఊ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అయితే.. ప్రేక్షకుల భద్రతను కాపాడటం కీలకమన్నారు. ప్రత్యేకించి బౌన్సర్లు ఉన్న కార్యక్రమాల్లో శాంతి భద్రతలను ఖచ్చితంగా కాపాడాలన్నారు. తమ అభిమానులను నియంత్రించడంలో సినీ ప్రముఖులు ముందుండాలని కోరారు.
సినీ పరిశ్రమ ప్రతిపాదనలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన సినీ ప్రముఖులు ఆయన ముందు పలు ప్రతిపాదనలు పెట్టారు. హీరో నాగార్జున మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ సినిమా రాజధానిగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ లెవెల్ స్టూడియోస్ అవసరమని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు సినీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని కోరారు. సురేష్ బాబు మాట్లాడుతూ చెన్నై నుంచి పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో అప్పటి ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
సీఎం పెద్ద లక్ష్యాలను నిర్దేశించారు : దిల్ రాజు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం అనంతరం బయటకు వచ్చిన దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే లక్ష్యంపై సమాలోచన జరిగిందన్నారు. టాలీవుడ్‌ను గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని, ఇందుకు తనవంతు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని దిల్ రాజు చెప్పారు.
సమాశానికి ముందు..
సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి రూ. 2 కోట్లు సాయాన్నిఅల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ప్రకటించారు. ఈ చెక్కును ముఖ్యమంత్రితో సమావేశానికి ముందు అల్లు అరవింద్ ద్వారా దిల్ రాజుకు అందజేశారు. శ్రీతేజ్, అతడి చెల్లెలు, తండ్రి భవిష్యత్తు కోసం ఈ నిధిని వినియోగిస్తామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..