Skill University | తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. త్వరలో బాధ్యతలు
Telangana Skill University | తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్ (Telangana Skill University Chairman)గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించినట్లు చెప్పారు ఆయన మరికొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు.
తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై విస్తృతంగా చర్చలు జరిపారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ది చేయనున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి ముఖ్యమంత్రి గతవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.. యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా అన్ని ఏర్పాటు చేశారు.
రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నారు. బ్యాగరి కంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగించనున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..