Telangana High Court On Musi River : మూసీ సుందరీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. మూసీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడంతోపాటు మూసీలో కలుషిత నీరు కలవకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది.
మూసీ నది ప్రక్షాళనపై కీలక మార్గదర్శకాలు ఇవీ
మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్దంగా, అనుమతులులేకుండా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మురుగునీరు, కలుషిత నీరు నదిలో చేరకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఆస్తులు కోల్పోయేవారికి ఆర్థిక చేయూతనివ్వాలని వారికి సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని సూచించింది.
ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇచ్చి ఆ భూయజమానులకి నోటీసులు జారీచేసి చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లను ఖాళీ చేయించడం, కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి తీర్పునిచ్చారు. ఒకే అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లను విచారిస్తూ.. ఇళ్లను ఖాళీ చేయించేందుకు, ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాలపై కీలక మార్గదర్శకాలను జారీచేశారు.
హైకోర్టు ఆదేశాలు ఇవీ..
- Musi River మూసీ బఫర్‌జోన్, ఎఫ్టీఎస్, రివర్‌బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించేటపుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
- మూసీ రివర్‌బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో గల తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువు లోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలి.
- 2012 బిల్డింగ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
- నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలు ఉన్నట్లయితే చట్టప్రకారం తొలగించాలి.
- మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకు పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలి.
- కోర్టు ఉత్తర్వుల అమలుకి నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి.
- నదులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న భూకబ్జాదారులపై ఇరిగేషన్ చట్టం 1357, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలి.