వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య
మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు.
NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు విన్నవించినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. ఆ వీడియో నకిలీదని, “మమ్మల్ని ట్రాప్ చేయడానికి కుట్ర” జరిగిందని అతని తండ్రి పేర్కొన్నారు. “మా అబ్బాయి అలా చేయలేడు,” అని అతను అధికారులకు మొరపెట్టుకున్నాడు. కానీ అత్యంత హేయమైన, అమానవీయ చర్యకు పాల్పడినందుకు శుక్లాపై శిక్ష తప్పలేదు.. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.
దీనిపై సీఎం చౌహాన్ స్పందిస్తూ.. “NSA కేసు స్టార్ట్ అయింది.. అవసరమైతే నేరస్థులను భూమిలోపల 10 అడుగుల దిగువన పాతిపెడతారు. చెడు ఆలోచనలు ఉన్నవారు మధ్యప్రదేశ్‌లో నేరం చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. అని ట్విటర్ లో పేర్కొన్నారు.
రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. “చట్టం తన పని తాను చేసుకుంటోంది.ఇది బిజెపి ప్రభుత్వం.. ఇక్కడ చట్టబద్ధమైన పాలన ఉంది. ఈ ఘటన వెలుగులోకి రాగానే
ఎన్‌ఎస్‌ఏ కింద విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కోరారు. అక్రమ ఆక్రమణలపై బుల్డోజర్ నడుస్తుంది.
మరోవైపు కాంగ్రెస్ ఈ అంశంపై బీజేపీపై ఒత్తిడి తెచ్చింది. ఆదివాసీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రజలకు రక్షణ కల్పించవద్దని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్ నాథ్ చౌహాన్‌ను హెచ్చరించారు. “సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేసిన వీడియో చూసి నా ఆత్మ వణికిపోయింది. ఈ ఘటన గిరిజనులపై దాడి. గిరిజన సమాజంపై దౌర్జన్యాలు చేసే వ్యక్తులకు రక్షణ కల్పించడం ఆపాలని శివరాజ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, వారికి న్యాయం చేస్తూనే ఉంటుంది’ అని నాథ్ అన్నారు.