Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం
Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్లడించారు.
రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బదులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర సచివాలయం నుంచి రైతులతో సీఎం మాట్లాడారు. లచ్చమ్మ అనే మహిళా రైతుతో మాట్లాడుతూ.. ఎంత పొలం ఉందని, అప్పు ఎంత తీసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం లోపు తన మొత్తం రుణం మాఫీ అవుతుందని భరోసా ఇచ్చారు. తాను ఢిల్లీకి వెళ్తున్నానని.. సోనియా గాంధీకి ఏమని చెప్పాలని వీడియోకాన్ఫిడెన్స్ ద్వారా సదరు మహిళా రైతును అడిగారు. వెంటనే ఆమె ధన్యవాదాలు తెలపమని కోరారు. కాగా రైతు రుణ మాఫీ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. గాంధీ భవన్ వద్ద దీపా మున్షీ పార్టీ నాయకులకు స్వీట్లు తినిపించుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు ,సీఎస్ శాంతి కుమారి, అధికారులు పాల్గొన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..