రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు
న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై “బ్లాక్ స్పాట్స్” తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు .
ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
“మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు.” అని గడ్కరీ అన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 3.84 లక్షల మంది గాయపడ్డారు. 2020లో రోడ్డు ప్రమాదాల్లో 1.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 3.49 లక్షల మంది గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు దాదాపు రూ.40,000 కోట్లను బ్లాక్‌స్పాట్‌ల ( black spots – ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలు )కోసం వెచ్చిస్తున్నామని, మేము ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాపై దృష్టి పెట్టామని తెలిపారు.
ప్రయత్నాలు సఫలం కాలేదని అంగీకరిస్తున్నా..
” ఎంతో నిజాయితీగా ప్రయత్నాలు చేసినప్పటికీ గత తొమ్మిదేళ్లలో రోడ్డు ప్రమాదాలను తగ్గించలేకపోయామని నేను అంగీకరిస్తున్నాను. ప్రమాదాలకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆరు-ఎయిర్ బ్యాగ్‌లు గల కార్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, సైనేజ్, మెరుగైన రోడ్ ఇంజనీరింగ్‌తో సహా అనేక అంశాల్లో మెరుగుదల కావాలి. అని పేర్కొన్నారు. వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదమని తెలిసినా కొందరు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ప్రజల సహకారం లేకుండా ప్రమాదాల సంఖ్యను తగ్గించడం చాలా కష్టం. రహదారి భద్రతకు సంబంధించి మానవ ప్రవర్తనలో మార్పు అనేది ఒక ముఖ్యమైన అంశం. రహదారి భద్రతపై అవగాహన పెంచడం, ప్రచారం కోసం మేము బాలీవుడ్ నుండి సినీ నటులు, క్రికెటర్లను నియమించాము. వారు మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు” అని తెలిపారు.
మౌలిక సదుపాయాలను పెంపొందించడం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతూ, నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వంటి రంగాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. “పెట్టుబడులు ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయి, తదనంతరం ఉద్యోగాలు పేదరికాన్ని తొలగిస్తాయి. భారతదేశ వృద్ధికి మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా కీలకం.” అని తెలిపారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్
2024 నాటికి రోడ్డు ప్రమాదాలు, మరణాలను 50 శాతానికి తగ్గించాలని గడ్కరీ గతేడాది సెప్టెంబర్‌లో పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో భారతదేశంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు దాదాపు 59 శాతం పెరిగింది. దేశం ఇప్పుడు US తర్వాత రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతదేశంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు 2013-14లో 91,287 కి.మీలు కాగా, 2022-23 నాటికి 145,240 కి.మీలకు పెరిగింది.
Electric Vehicles కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి..
తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి
👍👍