
- న్యూ ఇయర్ వేడుకల వేళ పెను ప్రమాదం తప్పించిన టోంక్ పోలీసులు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో వాడిన పేలుడు పదార్థాలే ఇక్కడ కూడా గుర్తింపు. - మారుతి సియాజ్ కారులో యూరియా బస్తాల మధ్య మృత్యు సామాగ్రి.
- బుండీ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితుల అరెస్ట్.. లోతైన విచారణ.
జైపూర్ : నూతన సంవత్సర వేడుకల వేళ రాజస్థాన్‌లో పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి భారీ ముప్పును తప్పించారు. గత నెల నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భీకర పేలుడులో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను టోంక్ పోలీసులు భారీగా స్వాధీనం (Explosives Seized) చేసుకున్నారు.
టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) మృత్యుంజయ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. నిర్దిష్ట నిఘా సమాచారం అందిన వెంటనే జిల్లా ప్రత్యేక బృందం (DST) రంగంలోకి దిగింది. బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక మారుతి సియాజ్ కారును అడ్డగించి తనిఖీ చేశారు.
ఆ తనిఖీల్లో కారులో యూరియా ఎరువుల బస్తాల మధ్య అత్యంత ప్రమాదకరమైన 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. దీంతో పాటు పోలీసులు 200 హై-ఇంటెన్సిటీ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటరీలు (డిటోనేటర్లు), సుమారు 1100 మీటర్ల పొడవున్న 6 కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్ కూడా సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బుండీ జిల్లాకు చెందిన సురేంద్ర పట్వా మరియు సురేంద్ర మోచి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఈ సామాగ్రిని బుండీ నుండి టోంక్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు వాడిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రకోట పేలుడుతో లింకు?
నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులోనూ అమ్మోనియం నైట్రేట్ వాడటం, ఇప్పుడు అదే పదార్థం భారీ స్థాయిలో దొరకడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ పదార్థాన్ని అక్రమ మైనింగ్ కోసం తరలిస్తున్నారా? లేక నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఏదైనా విద్రోహ చర్యకు పాల్పడేందుకు కుట్ర పన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. “ప్రస్తుతం నిందితులను ప్రశ్నిస్తున్నాం. ఈ పేలుడు పదార్థాల మూలం ఎక్కడ? వీటిని ఎవరికి డెలివరీ చేయాలి? అనే విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం” అని ఎస్పీ మృత్యుంజయ్ మిశ్రా వెల్లడించారు.

