67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..
ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ..
పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ముప్పును నివారించేందుకు పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అయతే వీరి ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయి.
తాజాగా సంగ్రూర్ జిల్లాలోని సుమారు 67 గ్రామాలు, 20 వార్డులు డ్రగ్ అమ్మకందారులను వ్యతిరేకిస్తూ వారిని సామాజికంగా బహిష్కరించాలని నిర్ణయించాయి. తమ గ్రామాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాలని తీర్మానించుకున్నాయి. దీని వెనుక పంజాబ్ పోలీసుల కష్టం ఎంతో ఉంది.
రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని, నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ (Cordon and Search Operations (CASO) ) మంచి ఫలితాలు ఇచ్చాయి.
గత బుధవారం, శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలోని మిద్దా గ్రామం, మలౌట్‌లోని మొహల్లా ఛజ్‌ఘర్‌తో సహా రెండు ప్రాంతాల ప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ఆదేశాల మేరకు పాటియాలా పరిధిలోని రెండు జిల్లాలు – సంగ్రూర్ తోపాటు బర్నాలాలో CASO నిర్వహించారు. మొత్తం ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పాటియాలా రేంజ్, ముఖ్‌విందర్ సింగ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించాలని SSPలను ఆదేశించారు.
ఈ మైలురాయిని సాధించినందుకు సంగ్రూర్ పోలీసు బృందాన్ని లా అండ్ ఆర్డర్, స్పెషల్ డిజిపి అర్పిత్ శుక్లా అభినందించారు. రాష్ట్రాన్ని నేర రహిత పంజాబ్’గా మార్చడానికి డ్రగ్స్ ముప్పును తొలగించడానికి ముందుకు రావాలని ప్రజలను కోరారు.
డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు డ్రగ్స్ స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అయితే డ్రగ్స్ పై డిమాండ్ తగ్గించేందుకు ప్రజల నుంచి మద్దతు తప్పనిసరి అని ఆయన కోరారు.
కార్డన్ సెర్చ్ గురించి వివరిస్తూ ఈ ఆపరేషన్ లో మొత్తం ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసు బృందాలు.. 11 మంది సంఘ వ్యతిరేక వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రత్యేక డిజిపి తెలిపారు. ఇది కాకుండా, పోలీసు బృందాలు 60 మంది అనుమానాస్పద వ్యక్తులను కూడా విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.