New Railway Line | ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త రైల్వే లైన్ పనులపై అధ్యయనం..
New Railway Line Works in Andhra | విజయవాడ: మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైలు మార్గ నిర్మాణాన్ని పరిశీలించేందుకు మచిలీపట్నం జేఎస్పీ ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తి మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. రైల్వే లైన్‌ను నిర్మించాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ బాలశౌరి సమగ్ర లేఖను సమర్పించారు. ఈ లైన్ కోసం చాలా కాలంగా డిమాండ్ ఉందని, దీని ఏర్పాటుతో దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇదే విషయమై గతంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని కి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు ప్రతిపాదిత రైల్వే లైన్‌పై అధ్యయనం చేయనున్నట్లు బాలశౌరీకి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని వివరంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత డైరెక్టరేట్‌ని కోరాం’’ అని ఎంపీకి కేంద్ర మంత్రి బదులిచ్చారు.
కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై రైల్వే మంత్రి స్పందన పట్ల ఎంపీ బాలశౌరి హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా, దివిసీమ ప్రజలు ఈ రైలు మార్గం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. వారి కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, రైల్వే లైన్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కొత్త రైల్వే లైన్‌తో ప్రయాణికులకు రవాణా సౌకర్యంతోపాటు ఆక్వా ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని ఎంపీ వివరించారు.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.