Manipur violence : మణిపూర్ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్
కేసును సీబీఐకి అప్పగించే ఛాన్స్
Manipur violence : మణిపూర్ భయానక లైంగిక వేధింపుల కేసులో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నివేదికల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వైరల్ వీడియో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి రిఫర్ చేసే అవకాశం ఉంది. వైరల్ వీడియో కేసు విచారణను మణిపూర్ వెలుపల జరపాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది. పొరుగు రాష్ట్రమైన అస్సాంలో విచారణ జరిగే అవకాశం ఉంది.
కుకీ, మెయిటీ గ్రూపులతో చర్చలు
మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కుకీ, మెయిటీ గ్రూపులతో MHA సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
“కేంద్రం కుకీ, మెయిటీ కమ్యూనిటీల సభ్యులతో అనేక రౌండ్ల చర్చలు జరిపింది. ప్రతి సంఘంతో ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. ” శాంతి చర్చలను హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి మూడు గంటలకు రాష్ట్రంలోని పరిస్థితిని తనిఖీ చేయడమే కాకుండా శాంతి చర్చల గురించి రోజువారీ అప్‌డేట్‌లు తీసుకుంటున్నారు.
మణిపూర్ సాధారణ స్థితికి వచ్చే సూచనలు
మణిపూర్‌లో పాఠశాలలు, కార్యాలయాల్లో హాజరు శాతం పెరగడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత వారం రోజుల్లో పాఠశాలల్లో 82 శాతం హాజరు నమోదు కాగా, కార్యాలయాల్లో 72 శాతం హాజరు నమోదైంది. జూలై 17 తర్వాత రాష్ట్రంలో ఒక్క ప్రాణ నష్టం కూడా నమోదు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మణిపూర్‌లో గత మే నెలలో హింస మొదలైనప్పటి నుం ఇప్పటివరకు సుమారు చి10వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఘర్షణలో 181 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సుమారు 60 మంది మైతేయిలు ఉండగా.. 113 మంది కుకీలు ఉన్నారు. ఇందులో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తంగా 21 మంది మహిళలు ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
రెండు వర్గాల కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితిపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన చేయాలని, దానిపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి