వరంగల్ గగనానికి రెక్కలు.. మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్! -Mamnoor Airport Warangal
- కేంద్రానికి భూముల అధికారిక అప్పగింత..
- 2.5 ఏళ్లలో విమానాలు ఎగిరేలా లక్ష్యం –
- కాకతీయుల శిల్పకళా వైభవంతో టెర్మినల్ భవనం
- – కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు
- ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇది దిశానిర్దేశం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mamnoor Airport Warangal : ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. చారిత్రక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు కీలక అడ్డంకిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కు అధికారికంగా అప్పగించారు.
కాకతీయ శిల్పకళతో టెర్మినల్ నిర్మాణం:
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, మామునూరు విమానాశ్రయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
- మౌలిక వసతులు(Warangal Airport Development): 2,500 మీటర్ల రన్‌వే, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్ వంటి సదుపాయాలను భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) స్వయంగా నిర్మిస్తుంది.
- వారసత్వ కళ: విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని కాకతీయుల శిల్పకళా వైభవం, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా రూపకల్పన చేస్తామని ఆయన ప్రకటించారు. నిర్మాణ పనులు ప్రారంభమైన 2 నుండి 2.5 ఏళ్లలో విమాన ప్రయాణాలు మొదలవుతాయని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
చారిత్రక వైభవం – ఆధునిక అభివృద్ధి:
నిజాం కాలంలో 1930లో నిర్మించిన ఈ విమానాశ్రయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వైమానిక కేంద్రంగా ఉన్న మామునూరును తిరిగి పునరుద్ధరించడం ద్వారా వరంగల్ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలుపుతామని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రైతులకు న్యాయం చేస్తూ భూసేకరణ పూర్తి చేశామని, ఇది ఐటీ, టెక్స్‌టైల్ మరియు పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ విమానాశ్రయం ఒక్కటే కాకుండా కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం అనుమతులు రాగానే భూసేకరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

