నిద్రలేవగానే ఎదురుగా కాలికి చుట్టుకొని ఉన్న కాలనాగు.. మూడు గంటలపాటు ప్రార్థనలు..
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నిద్రలేస్తుండగానే ఆమె కాళ్లకు కాలనాగు చుట్టుకొని బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. అది ఎక్కడ కాటేస్తుందోనని భయాందోళనతోనే అది ప్రశాంతంగా వెళ్లిపోయేవరకు వేచి ఉంది. ధైర్యాన్ని కూడగట్టుకొని ఏకంగా మూడు గంటలపాటు అలాగే కూర్చుండిపోయింది. పాము తనంతట తానుగా వెళ్లిపోవాలని కదలకుండా ఉండిపోయింది. మూడు గంటలకు పైగా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది.
వివరాల్లోకి వెళితే..
దహర్రా గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉన్న మిథ్లేష్ యాదవ్ సోమవారం ఉదయం తన కాలుపై ఏదో పట్టుకొని ఉన్నట్లు అనిపించింది. లేచి చూడగా ఓ రాచనాగు (కింగ్ కోబ్రా) తన కాలు చుట్టూ చుట్టుకొని ఉంది. వెంటనే ఆమె చేతులు జోడించి, క్షేమంగా విడిచిపెట్టాలని ప్రార్థించింది.
“నేను నా ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాను. నేను మేల్కొన్నప్పుడు.. నా కాలుకు పాము చుట్టుకోవడం చూశాను. నేను పిల్లలను తీసుకెళ్లమని నా తల్లికి చెప్పాను. అది వెళ్లిపోవడానికి గంటల తరబడి వేచి ఉన్నాను, ”అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథ్లేష్ యాదవ్ చెప్పారు.
ఆ మూడు గంటలపాటు ఆమె మనసులో ఏం అనుకున్నారు అని అడిగిన ప్రశ్నకు, పాములను ఇష్టపడే హిందూ దేవత అయిన శివుడిని ప్రార్థిస్తున్నట్లు మిత్లేష్ చెప్పారు. “నేను భోలేనాథ్ (శివుడు)ని ప్రార్థిస్తూనే ఉన్నాను. అతను వచ్చినట్లుగానే బయలుదేరమని అడిగాను” అని మిథ్లేష్ చెప్పారు.
“ఒక్క క్షణం నేను బ్రతకలేనని అనుకున్నాను. నా పిల్లల గురించి భయమేసింది. నేను చనిపోతే వారిని ఎవరు చూసుకుంటారు అని ఆలోచించాను. నేను నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నాను. నా క్షేమం కోసం నా కుటుంబం కూడా వేడుకోవడం ప్రారంభించింది’ అని మిథ్లేష్ తెలిపారు. ఇంట్లో తన శ్రేయస్సు కోసం ఆమె కుటుంబంతోపాటు ఇరుగుపొరుగు ప్రజలు కూడా ప్రార్థనలు చేశారని తెలిపారు.
కుటుంబసభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికంగా ఉన్న పాము పట్టే వ్యక్తిని సంప్రదించారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా పాములు పట్టేవాడు రాకముందే ఆ కింగ్ కోబ్రా.. ఆ మహిళ కాలును విడిచి బయటకు వచ్చిఇంటి నుండి బయలుదేరింది.అది ఎవరికీ హాని కలగకుండా ఇంటి బయటికి వెళ్లడంతో దానిని బందించి సమీపంలోని అడవిలో వదిలేశారు.