Karimnagar – Husnabad Road | సిద్దిపేట, , కరీంనగర్ జిల్లా వాసులకు శుభవార్త.. త్వరలో సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి రూ.170 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట పట్టణాలకు 30 నుంచి 40 కిలోమీటర్ల లోపే ఉందని, ఇప్పటికే సిద్దిపేట – ఎల్కతుర్తి మధ్య ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే రూ.170 కోట్లతో హుస్నాబాద్ కరీంనగర్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి పొన్నం తెలిపారు. అంతేకాకుండా హుస్నాబాద్ - జనగామ (Husnabad-Janagama Road మధ్య ఫోర్ లైన్స్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా ఆయా జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
హుస్నాబాద్ లో ఇండస్ట్రియల్ పార్కు
పారిశ్రామికంగా హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం అక్కన్నపేట మండల కేంద్రంలో టిజిఐఐసి (TGIIC) ఇండస్ట్రియల్ పార్కు (Husnabad Industrial Park) ను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో టిజిఐసిసి అధికారులు, పారిశ్రామికవేత్తలు, అధికారుల తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన హుస్నాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్కన్నపేట మండల కేంద్రంలో టీజీఐఐసీ ద్వారా 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మంత్రి పొన్నం ప్రస్తావించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.431 కోట్లు మంజూరు చేసిందని ఆ నిధులతో కాలువలు నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు హుస్నాబాద్ ప్రాంతంలో 640 చెరువులు ఉన్నాయని వచ్చే వానాకాలం నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు నీటితో హుస్నాబాద్ ప్రాంతంలో అధిక పంటలు పండి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..