కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి
‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై ‘కుడా’ చైర్మన్ హనుమకొండ, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ‘కూడా’ వైస్ చైర్మన్ ప్రవీణ్యతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని అన్నారు. కాళోజీ కాలక్షేత్రం లో ఆర్ట్ గ్యాలరీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కాళోజీ రచనలు, సాహిత్యం, జీవిత చరిత్ర, పరిశోధనలు, ఆయన వాడిన వస్తువులు, ఫొటోలు, డాక్యుమెంటరీలే అన్నీ ఈ ఆర్ట్ గ్యాలరీ లో ఉండాలి అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సీటింగ్, లైటింగ్ సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కాళోజీ ఫౌండేషన్ కోసం ప్రత్యేకంగా మినీ ఆడిటోరియం, రెండు గదులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియంలో శబ్దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శబ్దాలు ప్రతిధ్వనించకుండా శాస్త్రియ పద్ధతులు పాటించాని సూచించారు. యువ కళాకారులను ప్రోత్సహించేందుకు కాళోజీ కళాక్షేత్రం ఎంతగానో దోహదపడుతుందని సుందర్ రాజ్ పేర్కొన్నారు. కళాక్షేత్రం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసే కాళోజీ విగ్రహం జీవకళ ఉట్టిపడే విధంగా రూపొందించాలని చెప్పారు. కాళోజీ కళా క్షేత్రం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో ‘కుడా’ పీవో అజిత్ రెడ్డి, కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ రామశాస్త్రి, ప్రధాన కార్యదర్శి విద్యార్థి, కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస్, ట్రెసరేర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.