
Indian Army Press Conference : పాకిస్తాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్లడించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ప్రెస్ మీటింగ్ ప్రారంభంలో 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడి, ఉరి, పుల్వామా మరియు పహల్గామ్ దాడులతో సహా భారతదేశంపై జరిగిన వివిధ దాడులకు సంబంధించిన క్లిప్‌ను కూడా ప్రదర్శించారు.
ఆర్మీ ఎక్కడ ఎందుకు దాడి చేసింది?
ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర్మీ సంయుక్త విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత సాయుధ దళాలు లష్కరే తోయిబా స్థావరంగా ఉన్న గుల్పూర్ ఉగ్రవాద శిబిరం, కోట్లిని ఎలా లక్ష్యంగా చేసుకున్నాయో వివరించారు. 2023 ఏప్రిల్ 20న పూంచ్ పై దాడిలో, 2024 జూన్ 9న యాత్రికుల బస్సుపై దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ శిబిరంలోనే శిక్షణ పొందారు.
POJKలో మొదటి లక్ష్యం
“POJK లో మొదటి లక్ష్యం ముజఫరాబాద్‌లోని సవాయి నాలా శిబిరం. ఇది నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం. అక్టోబర్ 20, 2024న సోనామార్గ్, అక్టోబర్ 24, 2024న గుల్మార్గ్, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లో జరిగిన దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడి నుండే శిక్షణ పొందారు” అని కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు.
పాకిస్తాన్‌లో దాడి ఎప్పుడు జరిగింది?
“ఈ దాడి బుధవారం తెల్లవారుజామున 1.05 నుంచి 1.30 గంటల మధ్య జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశారు. పాకిస్తాన్ లోని ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి ఈ ప్రదేశాలను ఎంపిక చేశారు” అని వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.
విదేశాంగ కార్యదర్శి ఏమి చెప్పారు?
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, “2025 ఏప్రిల్ 22న, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో లష్కరే, పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 25 మంది భారతీయులను, 1 నేపాలీ జాతీయుడిని చంపారు. ఉగ్రవాదులు వారి కుటుంబ సభ్యుల ముందే పర్యాటకుల తలపై కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకం మళ్లీ పెరుగుతున్నందున, దానిని దెబ్బ తీయడం, కశ్మీర్ లో అల్లర్లను ప్రేరేపించడం పహల్గామ్ దాడి ప్రధాన ఉద్దేశ్యం. పహల్గామ్ దాడి (Pahalgam terror attack) చాలా అనాగరికమైనది, దీనిలో బాధితులను చాలా దగ్గరగా తలపై కాల్చి చంపారు. వారి కుటుంబం ముందు చంపారు. పహల్గామ్ దాడికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే గ్రూపు బాధ్యత వహించింది. ఈ గ్రూపు లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉంది. ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారణ అయింది. పహల్గామ్ దాడిపై జరిగిన దర్యాప్తులో ఉగ్రవాదులతో పాకిస్తాన్ సంబంధాలు బయటపడ్డాయి. మా నిఘా సంస్థలు భారతదేశంపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయి, దీంతో వాటిని తక్షణమే నిరోధించడం అవసరమని భావించారు. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను నాశనం చేయడంపై మేము దృష్టి సారించాము. అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.